గద్వాల: ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని ఆయా శాఖల అధికారులకు పంపినట్లు వివరించారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, లేనిపక్షంలో అందుకు కారణాలు వివరిస్తూ ఫిర్యాదుదారునికి అక్‌నాలెడ్జ్‌మెంట్‌ను పంపాలని సూచించారు. అదేవిధంగా మండల స్థాయిలో అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తే చిన్నచిన్న సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం ఉండదన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


