
విద్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలి
గద్వాల టౌన్: జిల్లా విద్యాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీఈఓ మహ్మద్ అబ్దుల్ ఘనీ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో ఏర్పాటు చేసిన మండల విద్యాధికారుల విద్యా సంవత్సర సన్నాహక సమావేశంలో డీఈఓ పాల్గొని మాట్లాడారు. విద్యా వ్యవస్థ అభివృద్ధిలో మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు ముందుండి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర అధికారులు సూచించిన అన్ని కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు విధిగా పాల్గొనేలా చూడాలని సూచించారు. బడిబాట, యూడైస్, మార్కుల అప్‌లోడింగ్, శిక్షణ కార్యక్రమాలు, కాంప్లెక్స్ సమావేశాలు తదితర వాటిలో సహకరించాలని కోరారు. సీఆర్పీలు, ఎంఐఎస్‌లు, కోఆర్డినేటర్లు, సీసీఓలు డేటా నమోదులో చురుకుగా వ్యవహరించాలని చెప్పారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేసిన హెచ్‌ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. రాబోయే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు ఎస్తేర్‌రాణి, ఫర్జానాబేగం, డీసీబీ కార్యదర్శి ప్రతాప్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.