
‘నెట్టెంపాడు’ పెండింగ్ పనులు పూర్తి చేయండి
గద్వాల: జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద పెండింగ్‌లో ఉన్న 480 ఎకరాల భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. భూ సేకరణలో డిస్ట్రిబ్యూషన్స్, కెనాల్స్ వారీగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. అదే విధంగా భూ సేకరణ పరిహారం చెల్లించిన వెంటనే అవసరమైన సివిల్ పనులు పూర్తిచేయాలని సూచించారు. కాల్వల నిర్మాణంతో సాగు సౌకర్యాలు మెరుగవుతాయని తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎస్‌ఈ రహీముద్దీన్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఉన్నారు.