
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
ధరూరు: రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని భీంపురం, రేవులపల్లి, గార్లపాడు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కొన్న ధాన్యం వివరాలతో పాటు సెంటర్‌లో కల్పిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ధాన్యం విక్రయించిన రైతుల వివరాలను ట్యాబ్‌లో ఎంట్రీ చేసి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని త్వరగా తూకం వేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ వెంట ఏపీఎం శోభారాణి ఉన్నారు.