గద్వాల క్రైం: మహిళల రక్షణ కోసం షీ టీంలు విధులు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శుక్రవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళశాలలో విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో ఆవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్‌లలో 81 సమస్యాత్మక ప్రదేశాను గుర్తించి నిత్యం గస్తీ చేపట్టామన్నారు. వేధింపులకు గురి చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు సైతం తరలించామన్నారు. కళాశాలలో ర్యాగింగ్ వంటివి చేస్తే నిర్భయంగా అధ్యాపక బృందానికి తెలియజేయాలని, వేధింపులకు గురిచేసినా, సామాజిక మాద్యమాల ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాధితులు నేరుగా షీటీం సభ్యులకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100 లేదా 8712670312కు సంప్రదించాల్సిందిగా డీఎస్పీ తెలిపారు.
26న తైబజార్ వేలం
అలంపూర్: అలంపూర్ మున్సిపాలిటీ తైబజార్ వేలం పాటను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు, ఆసక్తి ఉన్న వారు 25వ తేదీ వరకు దరఖాస్తు ఫారాలను మున్సిపల్ కార్యాలయంలో తీసుకొని నిబంధనల మేరకు సాయంత్రం 5 గంటలోపు డీడీ డిపాజిట్లు అందజేయాలని తెలిపారు. మిగిలిన వివరాలకు మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు
గద్వాల: విధి నిర్వహణలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు శుక్రవారం తన ఛాంబర్‌లో కలెక్టర్ బీఎం సంతోష్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించి గుర్తింపు పొందాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తూ పారదర్శకత, నిబద్దత, ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జెడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, తదితరులు పాల్గొన్నారు.
మహిళల రక్షణే షీటీం ప్రధాన లక్ష్యం