కేటీదొడ్డి: మండల కేంద్రంతో పాటు నందిన్నె మీసేవ కేంద్రాలను ఈడీఎం శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీసేవ కేంద్రాలలో సిటిజన్ చార్ట్ నోటిస్ బోర్డ్, సర్టిఫికేట్, రిజిష్టర్, టోల్‌ఫ్రీ కాల్ నంబర్స్ ను ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ప్రజల నుండి ఆరా తీవారు. మీసేవ కేంద్రాల నిర్వహకులు సిటిజన్ చార్ట్ సర్టిఫికేట్స్ రిజిష్టర్ గురించి వినియోగదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యాలు కలిగించకుండా మీసేవలపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా నిర్ధేశించిన రుసుము మాత్రమే తీసుకోవాలని, అదనంగా తీసుకుంటే కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నూతన రేషన్‌కార్డుల సర్వీసులకు రూ.45 మాత్రమే చెల్లించాలని వినియోగదారులకు సూచించారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలందించడమే మీసేవ కేంద్రాల లక్ష్యం అని ఆయన తెలిపారు. ధరల పట్టిక కూడా క్షుణంగా కేంద్రాలలో ఉంచాలని సూచించారు. వారి వెంట మీసేవ జిల్లా యూనియన్ అధ్యక్షుడు సురేష్, వెంకటేష్ నాయుడు, మౌలాలి, తదితరులు ఉన్నారు.
ఆదివాసీ చెంచుల
సమస్యలపై పోరాటం
మన్ననూర్: నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆదివాసీ చెంచులకు కనీస సౌకర్యాల కల్పన కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ చెంచు ఐక్యవేదిక అధ్యక్షుడు చిగుర్ల మల్లికార్జున్ అన్నారు. బుధవారం చెంచు పెంటల్లో పర్యటించిన ఆయన.. అగర్లపెంటలో చెంచులతో సమావేశమై మాట్లాడారు. పాలకులు, అధికారులు చెంచుల సంక్షేమాన్ని కాగితలకే పరిమితం చేశారని విమర్శించారు. పండగలు, జాతర్ల పేరుతో చెంచు పెంటలకు వస్తున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు.. అరచేతిలో వైకుంఠం చూపించి చేతులు దులుపుకొంటున్నారని ఎద్దేవా చేశారు. చెంచులకు మౌలిక వసతుల కల్పన కోసం పాలకులు నిధులు మంజూరు చేస్తుంటే.. ఆంక్షల పేరుతో అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అప్పాపూర్, సార్లపల్లి గ్రామాలను ప్రత్యేక పంచాయతీగా గుర్తించినప్పటికీ.. ఇప్పటి వరకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం బాధాకరమన్నారు. వేసవి కాలం వచ్చిందంటే చెంచు పెంటల్లో నివసిస్తున్న చెంచులు ఆకలి దప్పులతో అలమటించిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచు పెంటలకు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు ఐటీడీఏ తరఫున మోడల్ జీపీ పాఠశాలలు, వైద్యం, అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందించాలని, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వేరుశనగ క్వింటాల్ రూ.7,050
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,050, కనిష్టంగా రూ.4,001 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,649, కనిష్టంగా రూ.6,111, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,329, కనిష్టంగా రూ.2,137, ఆముదాలు, జొన్నలు గరిష్టంగా రూ.4,379, కనిష్టంగా రూ.3,977 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ యార్డులో కందుల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,019గా ఒకే ధర పలికింది.