జిల్లాలో తెల్లరేషన్‌ కార్డులు 1,60,287 | Sakshi
Sakshi News home page

జిల్లాలో తెల్లరేషన్‌ కార్డులు 1,60,287

Published Sat, Mar 18 2023 1:34 AM

-

ఆయుష్మాన్‌ భారత్‌లో 64,904 మందికి మాత్రమే కార్డులు

ప్రచారం చేపట్టని అధికారులు

గ్రామీణులకు అవగాహన కరువు

సమాచారం లేక

ముందుకురాని ప్రజలు

మందకొడిగా ఈకేవైసీ ప్రక్రియ

గద్వాల: ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ కింద నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల వరకు కార్పొరేట్‌ స్థాయిలో ఉచిత వైద్యం పొందే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద రూ.2 లక్షల వరకే వైద్య ఖర్చులు చెల్లించేవారు. ఈ రెండు పథకాల విలీనంతో అదనంగా మరో రూ.3 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే జిల్లాలోని గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల పరిధిలో ఆరోగ్యమిత్ర, ఆరోగ్యశ్రీలతో పాటు సీఎస్‌సీ, స్మార్ట్‌ఐడీ వంటి ప్రైవేటు ఏజెన్సీలకు అవకాశం కల్పించారు. వచ్చే నెలలో కార్డుల జారీకి చర్యలు చేపడుతున్నారు.

ఎక్కడైనా ఉచితంగా సేవలు..

ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే రాష్ట్రంతో పాటు దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉచిత వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో ప్రతిఒక్కరికి వేర్వేరుగా ప్రత్యేక కార్డులు జారీ చేస్తారు. పలు రకాల వ్యాధులకు చికిత్స అందిస్తారు. ప్రధానంగా గుండె, కాలేయ, మోకాలి చిప్ప మార్పిడి తదితర శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చు. వ్యక్తి తప్పనిసరిగా శిబిరం వద్దకు వెళ్తే ఫొటో తీసుకుని వివరాలు నమోదు చేసుకుంటారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా వివరాలు సమర్పించవచ్చు. దగ్గర్లో ఉన్న పీహెచ్‌సీ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, ఆరోగ్య మిత్ర, ఏఎన్‌ఎంల వద్దకు వెళ్తే... ఆధార్‌కార్డు, ఫోన్‌ నంబర్‌ చెబితే చాలు నమోదు చేస్తారు.

ప్రతిఒక్కరికి పథకం వర్తించేలా..

ఆహార భద్రత కార్డు (రేషన్‌కార్డు) కలిగిన ప్రతిఒక్కరికి ఈ పథకం వర్తించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. క్షేత్రస్థాయిలో ఆరోగ్యమిత్ర, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో పాటు ప్రైవేటు ఏజెన్సీలు ఈ ప్రక్రియను పూర్తిచేస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ వివరాలు సమర్పించి అనుసంధానం చేసుకోవాలి. తద్వారా రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్య ఖర్చులు పొందే అవకాశం ఉంటుంది.

– సిద్ధప్ప,

డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, గద్వాల

Advertisement
Advertisement