
గట్టులో ఆడిట్ నిర్వహిస్తున్న అధికారులు
గట్టు: గట్టు గ్రామ పంచాయతీకి సంబంధించి నిధుల వినియోగంపై పెండింగ్‌లో ఉన్న ఆడిట్‌ను గురువారం జిల్లా ఆడిట్ అధికారి బీమ్లా నాయక్, నరేందర్‌రెడ్డి, వెంకట్రాములు, సతీష్ పూర్తి చేశారు. ఈ పంచాయతీలో 2016–17, 2017–18 సంవత్సరానికిగాను నిధులు దుర్వినియోగమైనట్లు స్టేట్ విజిలెన్స్ అధికారులకు కొందరు ఫిర్యాదు చేయగా, అప్పట్లోనే వారు రికార్డులను తనిఖీ చేసి, వెంట తీసుకెళ్లారు. దీంతో ఆ రెండేళ్ల రికార్డులు అందుబాటులో లేకపోవడంతో ఆడిట్ నిర్వహించలేకపోగా పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా ఈ రికార్డులు జిల్లా పంచాయతీ కార్యాలయానికి, అక్కడి నుంచి గట్టుకు చేరుకున్న తరుణంలో పెండింగ్‌లో ఉన్న రెండేళ్ల ఆడిట్‌ను ప్రస్తుతం అధికారులు పూర్తి చేసే పనిలో పడ్డారు. అప్పట్లో కార్యదర్శులుగా పని చేసిన వారిని రప్పించి, వారి ద్వారా నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలను ఆడిట్ అధికారులు సేకరించారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై అప్పట్లో విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అందుకు సంబందించిన 7మంది కార్యదర్శులపై చర్యలకు సిఫారస్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆడిట్ చేయకుండా ఉన్న దానిపై ప్రస్తుతం ఆడిట్ నిర్వహించినట్లు ఎంపీడీఓ చెన్నయ్య తెలిపారు.