పోటీల్లో ఆటలివే.. | - | Sakshi
Sakshi News home page

పోటీల్లో ఆటలివే..

Aug 25 2026 12:57 AM | Updated on Aug 25 2026 12:57 AM

భూపాలపల్లి అర్బన్‌: పాఠశాల విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహించే స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) క్రీడలు త్వరలో ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, కస్తూర్బా, గురుకుల, మోడల్‌ స్కూల్స్‌, ఇంటర్‌ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యాశాఖ నుంచి 2026–27 విద్యా సంవత్సరానికి గాను షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పోటీల్లో జిల్లాలోని 116 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, 70 ప్రైవేట్‌ పాఠశాలలు, కేజీవీబీ, మోడల్‌, గురుకుల, జూనియర్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులకు పాల్గొనే అవకాశం ఉంటుంది.

నాలుగు దశల్లో క్రీడలు

వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఎస్‌జీఎఫ్‌ క్రీడాపోటీలను నాలుగు దశల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ మొదటి లేదా రెండో వారంలో మండలస్థాయి క్రీడాపోటీలు ప్రారంభమవుతాయి. అనంతరం నియోజకవర్గ/బ్లాక్‌ స్థాయి పోటీలు జరుగుతాయి. వీటిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లాస్థాయి పోటీలకు సన్నద్ధమవుతారు. జిల్లాస్థాయిలో రాణించిన విద్యార్థులకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు.

కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌

ఈ పోటీలకు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరించనున్నారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో పాటు ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. అండర్‌–14, అండర్‌–17 విభాగాలకు పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీ), అండర్‌–19 విభాగాలకు పీడీలను ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా నియమిస్తారు. వీరి కాలపరిమితి రెండేళ్లు కాగా గడువు ముగిసిన వెంటనే కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది. జిల్లాలో గత ఏడాదే కమిటీని నియమించారు. కమిటీ సభ్యులు నాలుగు రోజుల క్రితం జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేసి క్రీడల నిర్వహణపై చర్చించారు.

నిధులు సమకూరేదెలా?

క్రీడల షెడ్యూల్‌, కమిటీల నియామకం బాగానే ఉన్నా.. పోటీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా నిధులు విడుదల కాలేదు. దీంతో విద్యార్థుల నుంచి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.14 ప్రయాణ ఖర్చుల కోసం ఉపాధ్యాయులు ఉపయోగిస్తుండగా, రూ.6 ఎస్‌జీఎఫ్‌ క్రీడల నిర్వహణ కోసం చెల్లించాల్సి ఉంటుంది. చాలా పాఠశాలల్లో అడ్మిషన్‌, పరీక్ష ఫీజుల సమయంలోనే ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. పాల్గొనే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో నిధుల సమీకరణ అంతంతమాత్రంగానే ఉంటోంది. దీంతో భారమంతా నిర్వాహకులపై పడుతుండటంతో.. బహుమతులు, భోజన వసతి కోసం దాతల విరాళాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారైనా ప్రభుత్వం స్పందించి క్రీడల నిర్వహణకు తగిన నిధులను సమకూర్చాలని పలువురు కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో పోటీపడనున్నారు. ఇంటర్‌ విద్యార్థులు అండర్‌–19 విభాగంలో పాల్గొంటారు. బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు ఉంటాయి. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, వాలీబాల్‌, బాక్సింగ్‌, చెస్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, ఖోఖో, నెట్‌బాల్‌, స్కేటింగ్‌, స్విమ్మింగ్‌, యోగా తదితర అంశాల్లో పోటీలు జరుగుతాయి. కొన్ని పోటీలను మండల స్థాయిలో, మరికొన్నింటిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement