● కాళేశ్వరం జోన్ డీఐజీ
అంబర్‌కిశోర్‌ఝా
కాళేశ్వరం/మల్హర్: పోలీసులు ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించాలని కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్‌ఝా పోలీసు అధికారులకు సూచించారు. గురువారం ఎస్పీ సంకీర్త్‌తో కలిసి కొయ్యూరు పోలీస్‌స్టేషన్, మహదేవపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన సేవలందించడం ప్రతీ పోలీస్ అధికారి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజిబుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలన్నారు. కేసులను సకాలంలో పరిష్కరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా సేవలందించాలని ఆదేశించారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో డీఐజీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం, మహదేవపూర్ సీఐలు నాగార్జునరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


