వివరాలు..
సీడ్ త్వరగా వేస్తేనే ప్రయోజనం..
20న టెండర్..
● రేపే టెండర్ల ప్రక్రియ
● నెలాఖరులోగా సీడ్ వదిలేలా
కార్యాచరణ
భూపాలపల్లి రూరల్: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈ సారి వర్షాభావ పరిస్థితులు నెలకొనగా.. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో జలకళ సంతరించుకుంది. చేప పిల్లల సీడ్ వదిలేందుకు ఇదే అనువైన సమయమని ప్రభుత్వం భావించింది. చేప పిల్లల సరఫరాకు సంబంధించి ఈ నెల 20న (గురువారం) కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు అధికా రులు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
గతేడాది మాదిరిగా ఈసారి కూడా 2.22 కోట్ల చేప పిల్లలను 781 చెరువులు, మూడు రిజర్వాయర్లలో వదిలేలా మత్స్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రవ్వు, బొచ్చె, బంగారు తీగ 35–40 ఎంఎం చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు. గణపురం, భీం ఘన్‌పూర్, బొగ్గులవాగు ప్రాజెక్టుల్లో 80–100 ఎంఎం రవ్వు, బొచ్చె, మృగాల(గ్యాస్‌కట్) చేప పిల్లలను వదిలేలా కార్యాచరణ రూపొందించారు. సీడ్ సరఫరా సామర్థ్యానికి అనుగుణంగా కాంట్రాక్టర్లను కలెక్టర్ నేతృత్వంలో ఎంపిక చేయనున్నారు. ఎంపికై న వారు నిబంధనలకు అనుగుణంగా సీడ్‌ను జలాశయాల్లో వదలాల్సి ఉంటుంది.
సాధారణంగా చేప పిల్లల సీడ్‌ను జూలై, ఆగస్టులో వదిలితేనే అవి మార్చి వరకు సమృద్ధిగా ఎదిగి మత్స్యకారులు పట్టుకుని విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుంది. గతేడాది నుంచి సీడ్ పంపిణీలో తీవ్ర జాప్యం అవుతోంది. డిసెంబర్ వరకు కూడా సీడ్ వదలడంతో చేపల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఈ సారి కొంత ఆలస్యంగానైనా చెరువులు నిండినందున ప్రభుత్వం ప్రక్రియను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.
మత్స్యపారిశ్రామిక సంఘాలు 133
మత్స్యకార సంఘాల్లోని సభ్యులు 10,425
జిల్లాలో చెరువులు 781
చేప పిల్లల పంపిణీ లక్ష్యం 2.22 కోట్లు
35–40 ఎంఎం సైజ్ 1.82 కోట్లు
90–100 ఎంఎం సైజ్ 39.74 లక్షలు
ఈ ఏడాది ఎల్‌నినోతో వర్షాలు ఆలస్యంగా కురిశాయి. ఇటీవల అల్ప పీడనంతో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటల్లో నీరు చేరింది. అధికారులు ఆలస్యం చేయకుండా త్వరితగతిన పంపిణీ ప్రక్రియ పూర్తిచేస్తే మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
– జోరు రాము, మత్స్యకారుడు, కాసీంపల్లి
చేప సీడ్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా కాంట్రాక్టర్ల ఎంపిక కోసం ఈనెల 20న టెండర్ పూర్తికానుంది. వీలైనంత త్వరగా నెలాఖరుకు లేదా వచ్చే నెల మొదటి వారంలో సీడ్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం.
– విజయ్‌కుమార్,
జిల్లా మత్స్యశాఖ అధికారి


