● కలెక్టర్ రాహుల్ శర్మ
మల్హర్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని పట్టుదలతో ముందుకు సాగాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. మంగళవారం మండలంలోని మల్లారం కస్తూర్బా పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, వంటగది, స్టోర్ రూమ్, విద్యార్థినుల వసతి గదులు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. విద్య, వసతి, భోజనం, ఆరోగ్యం, భద్రత, క్రీడలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజ నం చేశారు. ఈ కార్యక్రమంలో కాటారం ఆర్డీఓ రవీందర్, డీఈఓ రాజేందర్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ వైద్యసిబ్బంది ఆదేశించారు. తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియను నిబంధనల ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం ఆర్డీఓ రవీందర్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ రవికుమార్, డీటీ ఇమామ్‌బాషా, వైద్యులు పాల్గొన్నారు.


