ఆకట్టుకున్న నాటిక | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న నాటిక

Aug 15 2026 12:58 AM | Updated on Aug 15 2026 12:58 AM

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలోని సీఈఆర్‌ క్లబ్‌లో శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర, ఆశయాలు, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి, సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి నాటికను ప్రారంభించారు. అంబేడ్కర్‌ బాల్యం, విద్యాభ్యాసం, ఎదుర్కొన్న సామాజిక వివక్ష, విద్య ద్వారా సాధించిన ఉన్నత స్థానం, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం, రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన కీలకపాత్రను కళాకారులు భావోద్వేగభరితంగా ప్రదర్శించారు. నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సామాజిక సమానత్వం, రాజ్యాంగ స్ఫూర్తి, సామాజిక బాధ్యతలపై ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా జీఎం రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ జీవితం, ఆశయాలు, సమాజానికి ఆయన చేసిన సేవలను కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారని అభినందించారు. ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజల్లో కళా, సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తిని పెంపొందించేందుకు సింగరేణి సంస్థ ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఐఈడీ జ్యోతి, ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ మాటూరి రవీందర్‌, పర్సనల్‌ మేనేజర్‌ శ్యామ్‌సుందర్‌, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల రమేశ్‌, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ బ్రాంచ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మధుకర్‌రెడ్డి, సీఎంఓఏఐ అధ్యక్షుడు నజీర్‌, ఎస్సీ, ఎస్టీ లైజన్‌ అధికారులు, వివిధ యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, సేవ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేయూ ఇంజనీరింగ్‌

విద్యార్థి ప్రతిభ

కేయూ క్యాంపస్‌: హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సురక్షా తిరంగా సైబర్‌ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇందులో సైబర్‌ మోసాల నిరోధానికి కేయూ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి సావస్కర్‌ వీడియో (రీల్‌) ద్వితీయ బహుమతి దక్కించుకుంది. అనంతరం సర్టిఫికెట్‌, ప్రశంసపత్రాలు అందించారు. డీజీపీ ఆనంద్‌, ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున, పోలీస్‌ ఉన్నతాధికారి సజ్జనార్‌ చేతుల మీదుగా సావస్కర్‌ ప్రశంసపత్రం అందుకున్నారు. వర్సిటీ ఎడ్యుకేషనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన సాయికుందన్‌, సంజయ్‌ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందుకున్నట్లు ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్‌ సంతోష్‌ తెలిపారు.

గోదావరి ఒడ్డున

టేకు దుంగలు లభ్యం

వెంకటాపురం(కె): మండల పరిధిలోని బెస్తగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నది ఒడ్డున ఐదు టేకు దుంగలను అటవీశాఖ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం అటవీశాఖ అధికారి ముక్తార్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. బెస్తగూడెం గోదావరి నది ఒడ్డున ఐదు టేకు దుంగలు ఉన్నాయిని విశ్వసనీయ సమాచారం వచ్చిందని తెలిపారు. సిబ్బందితో కలిసి గోదావరి నది ఒడ్డుకు వెళ్లి ఐదు టేకు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.45 వేల వరకు ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement