మల్హర్(కాటారం): కాటారం–మంథని ప్రధాన రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం శంకరంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జంగాలవాడ, గొల్లపల్లి గ్రామస్తులు రహదారిపై వాహనాలు నిలిపి నిరసన, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విస్తరణ పనులు చేపట్టకుండా జాప్యం చేయడంతో వాహనాలతో రహదారిపై భారీగా దుమ్ము, ధూళి వెలువడి పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి తక్షణమే నీళ్లు చల్లడంతో పాటు రోడ్డు పనులను పూర్తిచేయాలని కోరారు. ధర్నా కారణంగా కాటారం–మంథని వైపు వాహనాలు భారీగా నిలిచిపోయి రవాణా స్తంభించింది. కాటారం ఎస్సై శ్రీనివాస్ అక్కడికి చేరుకొని సమస్య పరిష్కరమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.


