అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా | - | Sakshi
Sakshi News home page

అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా

Jun 22 2026 1:00 AM | Updated on Jun 22 2026 1:00 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్‌: ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని.. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణరావు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో యోగా ఫర్‌ హెల్ది ఏజింగ్‌ అనే ఇతివృత్తంతో జిల్లా స్థాయి యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఏఎస్పీ నరేష్‌ కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమరయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యోగా ఆసనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరంతర యోగా సాధన ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానం అలవడుతుందని తెలిపారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, ఆరోగ్య, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి తోడ్పడుతుందని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న, పెద్దల వరకు ప్రతీ ఒక్కరు సాధన చేయాలని అన్నారు. ఆరోగ్యంగా ఉండటమే మహాభాగ్యమని మనిషికి బలమైన పునాది ఆరోగ్యమని అని ఆయన పేర్కొన్నారు. అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నరేష్‌ కుమార్‌ మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతాయని అన్నారు. వయోభేదం లేకుండా అన్ని వయస్సుల వారు యోగా సాధన చేయాలని సూచించారు. అనంతరం యోగా గురువు కుమార్‌ యోగా ఆసనాలు, ప్రాణాయామాలను చేయిస్తూ, ప్రతీ ఆసనం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి రాఘవేంద్రరావు, వైద్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: కార్యక్రమంలో జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ రాఘవేంద్రరావు, యోగా గురువు కుమార్‌, డిప్యూటీ నోడల్‌ అధికారులు డాక్టర్‌ కృష్ణవేణి, డాక్టర్‌ జగదీష్‌ ఖన్నా, డాక్టర్‌ ప్రేమ్‌ సాగర్‌, డాక్టర్‌ సదానందం, డాక్టర్‌ అజయ్‌, ఆయుష్‌ వైద్యులు, యోగా గురువులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement