భూపాలపల్లి: జయశంకర్, ములుగు జిల్లాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య రక్షణకు మరో ముందడుగు పడింది. భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్)లో అత్యాధునిక ఎంఆర్‌ఐ స్కాన్ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. నెల రోజుల్లోగా ఈ సేవలను రోగులకు అందించేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది.
మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు సేవలు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందించిన సుమారు రూ.10 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో ఈ అత్యాధునిక ఎంఆర్‌ఐ స్కాన్ యంత్రాన్ని జిల్లా ఆస్పత్రిలో విజయవంతంగా బిగించారు. వేలాది రూపాయల ఖరీదైన ఈ స్కాన్ సేవలు ఇకపై స్థానిక పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందనున్నాయి. ఈ స్కాన్ యంత్రం సేవలు అందుబాటులోకి వస్తే కేవలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులకే కాకుండా పొరుగునే ఉన్న ములుగు జిల్లా ప్రజలకు కూడా ఎంతో లబ్ధి చేకూరనుంది. అంతేకాక సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పరిధిలోని మారుమూల గ్రామాల రోగులు సైతం ఇకపై కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు పొందనున్నారు. గతంలో రహదారి ప్రమాదాలు, ఏదైనా అనారోగ్యానికి గురైతే వరంగల్, హైదరబాద్ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఎంఆర్‌ఐ స్కాన్ యంత్రం ఇక్కడ అందుబాటులోకి వస్తే దూరభారం తగ్గడమే కాక సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి.
టెక్నీషియన్లకు పూర్తి కావస్తున్న శిక్షణ..
మిషన్ నిర్వహణ కోసం కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి ఇద్దరు నిపుణులైన టెక్నీషియన్లను నియమించారు. ప్రస్తుతం వీరికి సంబంధిత కంపెనీ ఇంజనీర్ల ద్వారా యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలో క్షేత్రస్థాయిలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ శిక్షణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్..
రానున్న 20 రోజుల్లోనే అన్ని పనులను పూర్తి చేసి ఈ యంత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. వారం రోజులకో మారు ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షలు నిర్వహించడంతో పాటు మిషన్ బిగింపు పనులను వేగిరం చేశారు.
వర్చువల్ విధానంలో సీఎం ప్రారంభం..?
భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక ఎంఆర్‌ఐ యంత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్చువల్ విధానంలో (ఆన్‌లైన్ ద్వారా) ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు మంత్రులను కూడా ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే భూపాలపల్లి వైద్య రంగంలో ఇదొక చరిత్రగా నిలువనుంది.
నెల రోజుల్లోనే ప్రారంభానికి సిద్ధం..
రూ.10కోట్లతో అత్యాధునిక
యంత్రం ఏర్పాటు
భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రజలకూ వరం


