బోసిపోయిన కాళేశ్వరం | - | Sakshi
Sakshi News home page

బోసిపోయిన కాళేశ్వరం

Jun 19 2026 1:00 AM | Updated on Jun 19 2026 1:00 AM

నిత్యం శివనామస్మరణ, భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరాలయం ప్రస్తుతం బోసిపోయింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం కావడంతో భక్తుల సందడి తగ్గింది. నిన్నటి వరకు వేలాది మందితో కళకళలాడిన ఆలయ పరిసరాలు గురువారం నిర్మానుష్యంగా మారి నిశ్శబ్దాన్ని తలపించాయి. అడవిలోని ఆదిముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి భక్తులకు దేవాదాయశాఖ దర్శనాలకు వీలు కల్పించింది. సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో సుదూర ప్రాంతాలనుంచి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– కాళేశ్వరం

భక్తులు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారిన కాళేశ్వరాలయం

జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వరం ముక్తీశ్వరస్వామి ఆలయం ప్రస్తుతం జీర్ణోద్ధరణ, తొలగింపు కార్యక్రమాలతో దేవస్థానంలో పూజలు నిలిపివేశారు. భక్తుల దర్శనాల కోసం బాలాలయం ఏర్పాటుచేశారు. ఆదిముక్తీశ్వరాలయం బాలాలయానికి మార్చబడిందని బోర్డు ఏర్పాటు చేశారు. ఇది గమనించని భక్తులు బాలాలయం ఎక్కడ అంటూ స్థానికులను అడుగుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు దారి తెలియక తికమక పడుతున్నారు. రూట్‌మ్యాప్‌ లాంటి ప్లెక్సీబోర్డు, విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంది. బాలాలయంలో పూజలు, ప్రసాదాల కోసం బోర్డులు ఏర్పాటు కాలేదు.

దుకాణదారులకు నీడ కరువు..

ప్రతీ ఏడాది సుమారు రూ.కోటి ఆదాయం వచ్చే దుకాణదారులకు నిలువ నీడ కరువైంది. బాలాలయం వద్ద ప్లాట్‌పారం ఏర్పాటు చేశారు. అక్కడే సామగ్రి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం కావడంతో వర్షానికి తడిసే అవకాశం ఉందని ఈఓను కలిస్తే.. మీరే రేకులు వేయించకోవాలని హితవు పలికినట్లు తెలిసింది. దీంతో దుకాణాల నిర్వహణకు నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. వారి పరిస్ధితిపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.

శని, కాలసర్ప పూజలు ఎక్కడ..

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ నుంచి నిత్యం మంగళవారం శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, శనివారం నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు అధికంగా నిర్వహిస్తారు. భక్తులు దర్శించుకొని పూజలు చేయడంతో ఆలయానికి ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పూజల నిర్వహణ ఎక్కడ చేస్తారని దేవాదాయశాఖ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో భక్తులు కలవరపడుతున్నారు. దేవాదాయశాఖ అధికారులు మౌనం పాటిస్తుండడంతో భక్తులకు పాలుపోవడం లేదు. బుధవారం బాలాలయంలో ప్రాణప్రతిష్ఠ చేసిన ఉత్సవ మూర్తులను ఆసీనులు చేశారు. కాటారం నుంచి కాళేశ్వరం వరకు ఆయా బస్టాండ్‌ పాంతాలు, రద్దీ ప్రాంతాల్లో, హోటళ్ల వద్ద భక్తులకు, ప్రజలకు తెలిసేలా ఆలయాన్ని మార్చబడిందని, పూజల వివరాలు సూచిక బోర్డులు పెట్టాలని భక్తజనం కోరుతున్నారు.

బాలాలయం వద్ద దర్శనాలు

సూచిక బోర్డులు లేక ఇబ్బందులు

అయోమయంలో సుదూర ప్రాంత భక్తులు

దుకాణదారులకు ప్లాట్‌ ఫారమే దిక్కు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement