భూపాలపల్లి రూరల్: వాతావరణంలో మార్పుల కారణంగా స్వల్ప కాలిక పంటలను సాగు చేయాలని, తొందరపడి పంటలు సాగు చేయొద్దని జిల్లా వ్యవసాయాధికారి బాబురావు సూచించారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. రైతులు పప్పులు, మినుములు, పెసర తదితర పంటలతో పాటు వరిలో స్వల్పకాలిక పంటలను సాగుచేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. జిల్లాలోని రైతులు డీఏఓకు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ప్రశ్న: వరిలో ఏ రకాల వంగడాలు వేస్తే
బాగుంటుంది.
– మార్క అజయ్, కొత్తపల్లి, (ఎస్‌ఎం)
భూపాలపల్లి
జవాబు: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సంవృద్ధిగా పడే అవకాశం లేదని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. రైతులు వీలైతే పప్పులు, చిరు ధాన్యాలు, 120 నుంచి 125 రోజుల్లో కోతకు వచ్చే 1618, జీఎల్, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా, కేఎన్‌ఎం జగిత్యాల లాంటి స్వల్ప కాలిక పంటలను సాగు చేయాలి.
ప్ర: ప్రస్తుత పరిస్థితులకు ఏఏ పంటలు సాగు చేయాలి?
– కుమారస్వామి, గణపురం
జ: పంటల మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పటికీ ఒకే రకమైన పంటలు సాగు చేస్తే భూమిలో సారం పెరగదు. ఈ ఏడాది వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉంది. ఉలువలు, కందులు, పెసర, మినుములు, బొబ్బెర్లు లాంటి పంటలు సాగు చేస్తే దిగుబడితో పాటు భూమి సారవంతమవుతోంది.
ప్ర: పత్తిలో ఎలాంటి విత్తనాలు వేస్తే బాగుంటుంది. ఎప్పుడు విత్తాలి?
–బొబ్బిల్ల రాజు, తాడిచెర్ల
జ: గత అనుభవాలను బట్టి మార్కెట్లో ఉన్న నాణ్యమైన పత్తి విత్తనాలను ఎంచుకోవాలి. సరైన వర్షాలు కురువలేదు.. కాబట్టి పత్తి విత్తనాలు ఇప్పుడే విత్తవద్దు. మట్టి 70 నుంచి 80 శాతం తడిచిన తర్వాతనే పత్తి విత్తనాలు విత్తుకోవాలి. లేదంటే రైతులు నష్టపోవాల్సి వస్తుంది.
ప్ర: జిల్లాలో ఎరువులు అందుబాటులో ఉంచాలి.
– నూకల ప్రకాశ్‌రెడ్డి, మోరంచపల్లి
భూపాలపల్లి,
జ: గతంలో భూపాలపల్లి, గణపురం మండలాల నుంచి ఎరువులు తీసుకునే విధంగా అవకాశం ఉండేది. ఇప్పుడు యాప్‌లో నమోదు చేసుకుంటే భూపాలపల్లి ఒక్కటే వస్తుంది. మోరంచపల్లి రైతులకు భూపాలపల్లి దూరం అవుతుందని ఫిర్యాదులు అందాయి. ఉన్నతాధికారులతో మాట్లాడి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. ఆగ్రో గ్రోమోర్‌లో కూడా అందుబాటులో ఉండేవిధంగా చూస్తాం.
ప్ర: సన్నాలు అన్నింటికీ బోనస్ వర్తిస్తుందా?
– తిప్పారపు సురేందర్, మొగుళ్లపల్లి
జ: సన్నాలకు ప్రభుత్వం అందించే బోనస్ వర్తిస్తుంది. ఈఏడాది 120 నుంచి 125 రోజుల్లో చేతికి వచ్చే విత్తనాలను సాగు చేసుకోవాలి. నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. రైతులకు ఉపయోగంగా ఉంటుంది. లేదంటే పంటమార్పిడి చేసి చిరు ధాన్యాలను పండించండి.
ప్ర: నకిలీ విత్తనాలను అరికట్టాలి.
– బుర్ర వెంకటేశ్‌గౌడ్, చిట్యాల
జ: జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు, వివిధ శాఖల ఆధ్వర్యలో టాస్క్‌పోర్స్ టీం ఏర్పాటు చేశాం. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకుంటాం. అధికారులు ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేస్తున్నారు. నకిలీ విత్తనాలపై ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
ప్ర: గతేడాది ఎరువులకు ఇబ్చందులు పడ్డాం.
– గుర్రం రాజయ్య, చిట్యాల
జ: ఈ ఏడాది యూరియా, డీఏపీ తదితర ఎరువులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. గతేడాది అక్కడక్కడ ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటల సాగు మేరకు ఎరువులు మీ మండల పరిధిలో అందుబాటులో ఉంటాయి. ఇబ్బందులు రాకుండా చూస్తాం.
ప్ర: వర్షాలు తక్కువ అంటున్నారు. పత్తి, వరి ఏఏ రకాలు ఎంచుకోవాలి.
– ర్యాగం రవి, చిట్యాల
జ: సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. అందుకే ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు. పత్తి, బోదెల పద్ధతి సాంద్రత విధానంలో సాగు చేస్తే మంచిది. వరిలో స్వల్పకాలిక రకాలను వెదజల్లే పద్ధతిలో జూలై 15వ తేదీ వరకు సాగు చేసుకోవచ్చు.
తొందరపడి పంటలు సాగు చేయొద్దు
ఎల్‌నినో ప్రభావంతో తక్కువ
వర్షపాతం నమోదయ్యే అవకాశం
లైసెన్స్‌డ్ షాపుల్లోనే
విత్తనాలు కొనుగోలు చేయాలి
రైతులకు జిల్లా వ్యవసాయాధికారి బాబురావు సూచనలు
‘సాక్షి’ ఫోన్‌ఇన్ కార్యక్రమానికి
అనూన్య స్పందన


