నిర్లక్ష్యం చేస్తే పథకాలు దూరం
కాళేశ్వరం: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ప్రతీ రైతు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని యునిక్ ఫార్మర్ ఐడీ నంబర్ పొందాలని స్పష్టంగా ఆదేశించింది. ఈ ఐడీ నంబర్ ఉంటేనే పీఎం కిసాన్, పంట బీమా, సబ్సిడీలు, రుణాలు వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హత ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
రైతుల అనాసక్తి..
జిల్లాలో రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, చాలా మంది రైతులు ఇప్పటికీ నమోదు చేయించుకోలేదు. జిల్లాలో ఇప్నటివరకు 65శాతం వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన రైతుల పేర్లు మళ్లీ రావడంతో కొంత ఆలస్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో 45 క్లస్టర్లలో 2.36 లక్షల ఎకరాల్లో 80వేల వరకు రైతులు పంటలు సాగు చేస్తున్నారు.
మీసేవ ద్వారా..
రైతులు తమ వివరాలను నమోదు చేసుకోకపోవడంతో వారికి పీఎం కిసాన్ సహా ఇతర పథకాల నిధులు అందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, రిజిస్ట్రేషన్ పూర్తి చేయని రైతుల మొబైల్ ఫోన్లకు సర్వే నంబర్లతో సహా ఎస్‌ఎంఎస్ సందేశాలు పంపిస్తున్నారు. దీంతో స్పందించిన కొందరు రైతులు మీ సేవ కేంద్రాలు, రైతు వేదికలు, లేదా వ్యవసాయ శాఖ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కొన్ని మీ సేవ కేంద్రాల్లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో మరికొందరు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు మిగిలిన రైతులకు ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందిస్తూ, త్వరితగతిన నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇలా..
రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాసుబుక్ వివరాలు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకెళ్లాలి. సమీపంలోని మీ సేవ కేంద్రం, వ్యవసాయ శాఖ కార్యాలయం, లేదా రైతు వేదిక వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేసుకున్నప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు పంట బీమా, సబ్సిడీలు, రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతుల వివరాలు సంబంధిత ఏఈఓల వద్ద అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రతీ రైతుకు యునిక్ ఐడీ ఉండటం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులందరూ వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో కూడా చేసుకోండి. లేకపోతే భవిష్యత్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు 65 శాతం రిజిస్ట్రేషన్ జరిగింది. ఆన్‌లైన్ సమస్యల వల్ల సజావుగా సాగడం లేదు. రెండు రోజుల్లో పూర్తి చేస్తాం. ఈ అంశంపై జూమ్ మీటింగ్‌లు జరుగుతున్నాయి.
– జాడి బాబురావు,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అంటున్న వ్యవసాయశాఖ
జిల్లాలో ఇప్పటికి 65శాతం రిజిస్ట్రేషన్‌లు
నిర్లక్ష్యం చేస్తే పథకాలు దూరం


