మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం
భూపాలపల్లి: నోటిఫికేషన్ వెలువడగానే మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ వెల్లడించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఐడీఓసీ నుంచి కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రి, సీఎస్ పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం కలెక్టర్ తన చాంబర్‌లో జిల్లా, మున్సిపల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. హోదాల వారీగా ఎన్నికల సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు.
ప్రజావాణిలో సమస్యలు పరిష్కరించాలి..
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి వినతులు సమర్పించిన వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణికి 46 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బంది రానివ్వొద్దు..
ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో నమోదు చేయాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ హెచ్చరించారు. తన చాంబర్‌లో సోమవారం పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, సహకార శాఖ, డీఆర్‌డీఏ, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు.
వివేకానందుడి బోధనలు మార్గదర్శకం..
యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శకమని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


