రేపు గోదారంగనాయకస్వామి కల్యాణం
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 14న బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు.
సంక్రాంతి ముగ్గుల పోటీలు..
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 14న బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయ ప్రాంగణంలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న మహిళలందరికీ ఔత్సాహిక బహుమతి ఇవ్వనున్నామని పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీలో పాల్గొనే మహిళలు ఎవరి ముగ్గులు, కలర్లు వారే వెంట తీసుకొని రావాలని తెలిపారు.
చిట్యాల: మండలంలోని నైన్‌పాక గ్రామంలో వెలిసిన నాపాక ఆలయాన్ని సినీ గేయ రచయిత వరికుప్పుల యాదగిరితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పెండెల ప్రభాకా రాచార్యులు వారిని ఘనంగా సన్మానించారు.
భూపాలపల్లి రూరల్: 1,650 గ్రాముల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన కుంట శివ, భూపాలపల్లి పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఉర్సు దిలీప్ కుమార్ సోమవారం ఉదయం భూపాలపల్లి బస్టాండ్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీచేయగా గంజాయి లభ్యమైంది. కేసు నమోదుచేసినట్లు సీఐ తెలిపారు.
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించగా రూ.6,71,954 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ కుమారస్వామి సమక్షంలో హుండీ కానుకలను శ్రీవల్లి సేవా సమితి సభ్యులు లెక్కించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, సర్పంచ్ చల్లగోండ రాజు, రామప్ప ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ, అర్చకుడు ఉమాశంకర్, టూరిజం గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్‌లు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో జేబు దొంగలున్నారు..జాగ్రత్త చేతివాటం ప్రదర్శించే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మేడారంలోని నార్లాపూర్ పీఎస్ పోలీసులు గత జాతరలో జేబు దొంగతనాలకు పాల్పడిన వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్‌ను సోమవారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. భక్తులు నగదు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు జాగ్రతగా ఉంచుకోవాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు.
రేపు గోదారంగనాయకస్వామి కల్యాణం
రేపు గోదారంగనాయకస్వామి కల్యాణం


