గాలిపటం.. గణిత పాఠం
ఆకాశంలో ఎగిరే పతంగిలో దాగి ఉన్న లెక్కల లోకం
భూపాలపల్లి అర్బన్: సంక్రాంతి వస్తుందంటేనే ముందుగా గుర్తుకొచ్చేది గాలిపటం. పొలాల్లో పంటలు కోసిన ఆనందాన్ని, కొత్త ఏడాదిపై ఆశలను ఆకాశంలో ఎగిరే పతంగుల రూపంలో వ్యక్తపరుస్తారు. ఉదయం నుంచే పిల్లలు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలతో మమేకమవుతారు. రంగురంగుల కాగితాలు, పొడవైన తోకలు, చుట్టూ తిరిగే దారం దృశ్యం పల్లె సంక్రాంతికి ప్రత్యేక శోభను ఇస్తుంది. సరదాగా కనిపించే ఈ ఆట వెనుక గణితం దాగి ఉందన్న విషయం చాలామందికి తెలియదు. గాలిపటం నిజానికి ఒక ఎగిరే గణిత నమూనా. అందుకే దీనిని ‘గణిత మంత్రం’గా చెప్పుకోవచ్చు.
పతంగుల తయారీలో లెక్కల జాదూ..
గాలిపటం తయారీ పూర్తిగా కొలతల మీద ఆధారపడి ఉంటుంది. కాగితాన్ని సమానంగా మడవడం, మధ్యలో చీలిక చేయడం, రెండు వైపులా సమతుల్యత ఉండేలా కత్తిరించడం.. ఇవన్నీ గణిత లెక్కలే. పొడవు, వెడల్పు సరిపోలకపోతే పతంగి ఆకాశంలో నిలవదు. కడ్డీలు పెట్టేటప్పుడు కేంద్రబిందువు కచ్చితంగా ఉండాలి. ఈ ప్రక్రియలో పిల్లలకు సహజంగానే జ్యామితి పరిచయం అవుతుంది. చతురస్రం, త్రిభుజం, సమాంతర రేఖలు వంటి భావనలు ఆటలోనే అలవడతాయి.
దారం తయారీలో సూత్రాల శాస్త్రం
పతంగి ఎంత అందంగా ఉన్నా దారం బలంగా లేకపోతే గెలుపు సాధ్యం కాదు. అందుకే సంక్రాంతి ముందు నుంచే దారం తయారీకి ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. పిండి, గాజు పొడి, రంగులు ఇవన్నీ సరైన నిష్పత్తిలో కలపాలి. ఎక్కువ గాజు ఉంటే ప్రమాదం, తక్కువైతే బలం ఉండదు. దారం మందం, పొడవు కూడా ముందే అంచనా వేస్తారు. ఇక్కడే పిల్లలకు నిష్పత్తులు, శాతం లెక్కలు అనుభవంగా నేర్చుకుంటారు.
కన్నాలు కట్టడంలో లెక్కలు
పతంగులకు కన్నాలు కట్టడం అత్యంత కీలకం. ఒక కన్నా పొడవుగా ఉంటే పతంగు ఒక వైపు వంగిపోతుంది. రెండు కన్నాలు సమాన పొడవులో ఉండాలి. మధ్య కన్నా కోణం కచ్చితంగా ఉండాలి. ఇది పూర్తిగా కోణాల గణితం. చిన్న తేడా కూడా పతంగు ప్రయాణాన్ని మార్చేస్తుంది. అందుకే పెద్దలు పిల్లలకు కన్నాలు కట్టేటప్పుడు ఓర్పుతో నేర్పిస్తారు. ఈ ప్రక్రియలో కొలతల ప్రాముఖ్యత వారికి అవగతమవుతుంది.
భద్రతలో కూడా గణితమే..
గాలిపటాలు సరదానే కానీ జాగ్రత్తలు తప్పనిసరి. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. రోడ్లపై ఎగురవేయకూడదు. దారం పొడవు ఎంత వరకు వదలాలో అంచనా ఉండాలి. చిన్న పిల్లలకు గాజు దారం ఇవ్వకూడదు. ఇవన్నీ ముందస్తు లెక్కలు. భద్రత అంటే కూడా సరైన అంచనాలే. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే పండుగ ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి గాలిపటం ఒక ఆట మాత్రమే కాదు అది ఒక జీవన పాఠం.
పల్లె సంక్రాంతికి ప్రాణంగా మారిన
గాలిపటం సంస్కృతి
సరదా ఆటలో శాసీ్త్రయ ఆలోచనలకు బీజం
పిల్లల చేతుల్లో నుంచి పుట్టే భవిష్యత్ గణితం
గాలిపటం ఎగురవేయడం అంటే గాలి వేగం, దారం ఒత్తిడి మధ్య సమతుల్యత గాలి దశను అంచనా వేసి దారం వదలాలా, పట్టాలా అనేది నిర్ణయించాలి. ఇది తక్షణ నిర్ణయ గణితం గాలి బలంగా ఉన్నప్పుడు దారాన్ని ఎక్కువగా వదలాలి. గాలి తగ్గితే కాస్త పట్టాలి. ఈ లెక్క తప్పితే గాలిపటం పడిపోతుంది. ఆటలోనే పిల్లలు వేగం, బలం, దిశ వంటి భౌతిక శాస్త్ర గణిత సూత్రాలను అర్థం చేసుకుంటారు.


