చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: సంక్రాంతి సెలవుల సందర్భంగా దొంగతనాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలు, బంధువుల ఇళ్లకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీసు గస్తీని మరింత పటిష్టం చేస్తామన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు సొంత ఊర్లకు వెళ్లే ముందు విలువైన వస్తువులు, నగదు, బంగారం లాంటివి ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లో భద్రపరుచుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్లే వారు ముందస్తుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే రాత్రి వేళల్లో నిఘా ఉంచడంతో పాటు పోలీసు బృందాలు గస్తీ చేపడుతాయన్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు.


