నేడు మంత్రుల సమీక్ష
హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా మంత్రులు సీతక్క, కొండా సురేఖలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
9న జిల్లా స్థాయి
అథ్లెటిక్స్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 9న సబ్ జూనియర్స్, జూనియర్స్ బాలబాలికలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పంతకాని సమ్మయ్య, పూతల సమ్మయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్–8 నుంచి అండర్–20 లోపు బాలబాలికలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
బ్లాక్ స్పాట్ల గుర్తింపు
భూపాలపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల జిల్లా అధికారులు జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్లను మంగళవారం గుర్తించారు. కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు పోలీసు, రవాణా, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల శాఖ అధికారులు రేగొండ మండలం కొప్పుల క్రాస్‌రోడ్ నుంచి మహదేవ్‌పూర్ జంక్షన్ వరకు పర్యటించి రోడ్డు ప్రమాదాలు జరిగే 10 బ్లాక్ స్పాట్‌లను గుర్తించారు. ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలు, రహదారి లోపాలు, సైన్ బోర్డుల లేమి, మలుపులు, లైటింగ్ సమస్యలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని, అవసరమైన మరమ్మతులు, సైన్ బోర్డుల ఏర్పాటు, స్పీడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఓ మహ్మద్ సంధాని, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఐరాడ్ డీఆర్‌ఎం లక్ష్మణ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
గణపురం: మండలంలోని లక్ష్మారెడ్డిపల్లె గ్రామంలో గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయగా.. 8 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. లక్ష్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మొగిలి రాజయ్యకు చెందిన గొర్రెల పాకలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత వీధి కుక్కలు లోపలికి చొరబడ్డాయి. కరవడంతో 8 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో 50వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు మొగిలి రాజయ్య ఆవేదన వ్యక్తంచేశారు.
పులి కాదు.. అడవి పిల్లి
రేగొండ: మండలంలోని మడతపల్లి శివారులోని రైస్ మిల్ వద్ద మంగళవారం పులి తిరుగుతున్నట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. దీంతో అటవీ సెక్షన్ అధికారి ప్రవీణ్ సిబ్బందితో కలిసి రైస్ మిల్లు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పాదముద్రలను పరిశీలించారు. అడవి పిల్లిగా నిర్ధారించారు. ఫోన్‌లో వీడియో తీసిన మిల్లు కార్మికుడిలో మాట్లాడి వివరాలు సేకరించారు. మిల్లు పక్క నుంచి జంతువు వెళుతుండగా అతి సమీపంలో నుంచి వీడియో తీసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు గీత, రాజేందర్ పాల్గొన్నారు.
నేడు మంత్రుల సమీక్ష


