ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి విధులకు హాజరయ్యే కార్మికులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని అన్నారు. శనివారం ఏరియాలోని కేటీకే 5వ గనిలో రహదారి భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పెరిగినప్పటికీ వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడం వల్ల ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 37 సంవత్సరాలుగా ‘రోడ్ సేఫ్టీ వీక్’ నిర్వహించినప్పటికీ ప్రమాదాలు తగ్గకపోవడంతో భారత ప్రభుత్వం దీనిని జాతీయ రోడ్ భద్రత మాసోత్సవంగా మార్పు చేసిందన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి నెల మొత్తం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాసోత్సవం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం గాయపడిన క్షతగాత్రులను త్వరితగతిన ఆస్పత్రికి చేర్చి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25వేల నగదు ప్రోత్సాహకం అందించడంతో పాటు, చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ఏఎంవీఐలు సుందర్‌లాల్, శ్రీనివాస్, సింగరేణి అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.
జిల్లా రవాణాశాఖ అధికారి మహమ్మద్ సంధాని


