పూలే సేవలు చిరస్మరణీయం
● కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్
భూపాలపల్లి అర్బన్: బాలికల కోసం తొలి పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు దిశానిర్దేశం చేసిన సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ కొనియాడారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సబ్‌కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తూ దేశానికి ఉత్తమ పౌరులను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బాలబాలికల్లో ప్రేరణ కలిగించేలా విద్యాబోధన చేయాలని, సమసమాజ నిర్మాణంలో విద్యార్థులను భాగస్వాములుగా తీర్చిదిద్దాలని కోరారు. ఆత్మవిశ్వాసంతో ప్రతీ సమస్యను అధిగమించేలా విద్యార్థులను మలచాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని 18మంది మహిళా ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, సీఎంఓ సామల రమేష్, ఏఎంఓ పింగిలి విజయపాల్‌రెడ్డి, ఏఎస్‌ఓ రామకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


