కార్మికులను మోసం చేసిన సంఘాలు
భూపాలపల్లి అర్బన్: సమస్యలను పరిష్కరించకుండా సింగరేణి కార్మికులను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు మోసంచేశాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాపాడటంలో టీబీజీకేఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్మికుల నమ్మకాన్ని పొందిన సంఘమే రాబోయే రోజుల్లో బలంగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ను నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోతే, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలను నమ్మి సింగరేణి కార్మికులు మోసపోయారన్నారు. కార్మికులకు లాభాల వాటా ఇవ్వడంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సింగరేణిని ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం వాడుకుంటుందని, కాంట్రాక్టర్లను సైతం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అప్పజెపుతూ సంస్థను నిండా ముంచుతుందని విమర్శించారు. 2025 డిసెంబర్ 27 నాటికి గుర్తింపు సంఘం కాలం చెల్లిందని, ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం సింగరేణిలో వెంటనే కార్మిక సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తూ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. మారుపేర్ల విషయంలో కార్మికులను సైతం మోసంచేసిందని మహిళలను అండర్ గ్రౌండ్‌లోకి దిగాలని బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. వివిధ సంఘాల నుంచి టీబీజీకేఎస్‌లో చేరిన నాయకులు బత్తిని సుదర్శన్, అనిల్‌రెడ్డి, సాంబయ్యతో పాటు మరో 30మంది కార్మికులకు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సమ్మయ్య, రత్నం అవినాష్‌రెడ్డి, మధు, సదానందం, సుంకర్ గోవర్ధన్, నరేందర్, మల్లారెడ్డి, రవి, రాజేందర్, రవీందర్, కుమారస్వామి పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి


