బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఆర్‌బీ డీఎస్పీ, ఆపరేషన్ స్మైల్ –12 కార్యక్రమ జిల్లా ఇన్‌చార్జ్ కిశోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం మేడారంలోని హరిత హోటల్‌లో బాలల పరిరక్షణ జిల్లా అధికారి ఓంకార్ అధ్యక్షతన నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మైనర్లను పనిలో పెట్టుకునే వారిని ఉపేక్షించబోమని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మేడారం జాతర నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపార వృత్తిదారులు, భిక్షాటన చేసేవారిలో బాలకార్మికులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేయాలన్నారు. పిల్లలు చదువుకుంటనే వారి భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందన్నారు. బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ వసుధ మట్లాడుతూ.. బాల్యం అమూల్యమైన దశ అని 14 ఏళ్ల పిల్లలు తప్పనిసరిగా బడిలో ఉండాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ.. బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ మాట్లాడారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు డాక్టర్ మధు, ఎస్సై ఇమ్మాన్యూఝెల్, హరికృష్ణ, సంజీవ, రజిని, విక్రమ్, గీత, చంటి, తదితరులు పాల్గొన్నారు.


