దివ్యాంగులకు ఉచిత శిక్షణ
భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలోని నిరుద్యోగ దివ్యాంగ యువతీ, యువకులకు సమర్థనం దివ్యాంగుల సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఐటీఈఎస్ (కంప్యూటర్, బీపీఓ, సాఫ్ట్‌స్కిల్స్) కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్ నల్లపు శ్రవణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయం ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. పదో తరగతి ఆపైన విద్యార్హతలు కలిగినవారు ఈనెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 63648 67804, 63648 63218 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని కోరారు.
ప్రైవేట్ అభ్యర్థులకు
ఐటీఐ పరీక్షలకు అర్హత
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులకు వివిధ ట్రెడ్‌లలో ప్రైవేట్ అభ్యర్థిగా పరీక్షలు రాసేందుకు అర్హత కల్పిస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జూమ్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత ట్రెడ్‌లో అభ్యర్థులు 3 సంవత్సరాలపైబడి సర్వీస్, నైపుణ్యత కలిగి ఉండాలని తెలిపారు. వారు పనిచేస్తున్న సంస్థ ధ్రువీకరణపత్రం, సంస్థ ఐడీ కార్డుతో వరంగల్ ప్రాంతీయ ఉపసంచాలకుల కార్యాలయంలో రూ.1,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
‘స్థానిక’ ఎన్నికల్లో
సత్తా చాటాలి
భూపాలపల్లి రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేవిధంగా.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరే విధంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశిధర్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని ప్రతి గ్రామానికి విస్తరింపజేయాలని, రేషన్ బియ్యానికి నిధులు కేంద్ర ప్రభుత్వానివే అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం నిధులని చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం వాటా ఉందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బట్టు రవి, దొంగల రాజేందర్, సయ్యద్ గాలిఫ్, మందల రఘునాథరెడ్డి, మాచన వేణి రవీందర్, సామల మధుసూదన్ రెడ్డి, తుమ్మేటి రామిరెడ్డి, సేనాపతి, ఊరటి మునేందర్, విప్లవ కుమార్ రెడ్డి జంజర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ మోసం
రేగొండ: సైబర్ మోసానికి ఓ బాధితుడు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.54 వేలు పోగొట్టుకున్న ఘటన మండలంలోని రంగయ్యపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై సందీప్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగయ్యపల్లికి చెందిన బండి హృషికీర్తన్ అనే వ్యక్తికి +8801340–462002 అనే నంబరు నుంచి టెలిగ్రామ్ ద్వారా ఓ సందేశం వచ్చింది. ఆన్‌లైన్‌లో పనులను పూర్తి చేసి డబ్బు సంపాదించమని అందుకు ముందుగా కొంత డిపాజిట్ చేయాలని ఆ మెసేజ్ సారాంశం. దీంతో బాధితుడు సైబర్ నేరగాళ్లకు వేర్వేరు యూపీఐ ఐడీలకు రూ.54,098 డిపాజిట్ చేశాడు. కానీ, తిరిగి డబ్బును సంపాదించలేకపోయాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించి 1930కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
నలుగురిపై వైల్డ్‌లైఫ్
యాక్ట్ కేసులు
ఏటూరునాగారం: నిబంధనలకు విరుద్ధంగా అడవిలో నిప్పు, వంట, ఆల్కాహాల్ సేవించడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించినందుకు నలుగురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (వైల్డ్‌లైఫ్ యాక్ట్) 1972 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి డిప్యూటీ రేంజ్ అఫీసర్లు పి.ప్రహ్లాద్, పి.నరేందర్ బుధవారం తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్నబోయినపల్లి సమీపంలోని అడవికి వెళ్లగా దుమ్మని శ్రీకాంత్, అడ్డూరి సుమంత్‌రెడ్డి, వినీత్‌రెడ్డి, ఖలీల్‌పాషాలు మద్యం సేవించడంతో పాటు వంట వండి అగ్గిపెట్టలను ఉపయోగించి అలాగే వదిలేయడంతో పాటు వంట వండి మంటలు ఆర్పక పోవడంతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం రేంజ్ కార్యలయం సిబ్బంది పాల్గొన్నారు.


