మహనీయుల ఆశయాలకు అనుగుణంగా పాలన
భూపాలపల్లి రూరల్: బాపూజీ గాంధీ, అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 29 వార్డులు రాఏనగర్, సుభాష్ కాలనీల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జై భీమ్, జై బాపూ, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా బాపూజీ, అంబేడ్కర్, భారత రాజ్యాంగ పీఠిక చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేశారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యమన్నారు. గాంధీ అంబేడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో కూడా అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. పాదయాత్ర సాగుతున్న క్రమంలో పలువురు కాలనీ వాసులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమాల్లో మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, వార్డుల ఇన్‌చార్జ్‌లు బీతి పృథ్వీ, పుల్లా మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


