కాళేశ్వరం: ఇసుక లారీలు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా పార్కింగ్ చేస్తుండడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై రెండు వరుసల్లో లారీలు వెళ్తుండడంతో జనం ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. జిల్లాలోని మహదేవపూర్ మండలం పలుగుల, మద్దులపల్లి, పూస్కుపల్లి, బొమ్మాపూర్, ఎలికేశ్వరం తదితర గ్రామాల్లో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక క్వారీలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీంతో నిత్యం హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ తదితర నగరాలు, పట్టణాలకు లారీలు, టిప్పర్లలో ఇసుక రవాణాతో తరలిపోతుంది. నెలన్నర రోజులుగా నిత్యం క్వారీ ల్లో ఇసుక క్వాంటిటీ మునుపటి కన్నా ఎక్కువగా పెంచడంతో లారీలు భారీగా క్యూ కడుతున్నాయి.
ఊపందుకున్న నిర్మాణాలు..
వేసవికాలం కావడంతో నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణాలతో పాటు ఇతర పనులకు ఇసుక అవసరం. దీంతో ఇసుకకు బాగా డిమాండ్ పెరిగింది. లారీలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నాయి. దీంతో ట్రాఫిక్‌జాం అవుతుంది. ఆయా గ్రామాల్లో రోడ్డుపై నిలిచి ఉండడంతో రోజువారి పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. డబుల్ రోడ్డుపై రెండు వరుసల్లో లారీలు ఖాళీ, లోడ్ లారీలు పక్కపక్కనే నిలిచి ఉండడంతో మధ్య నుంచి ప్రయాణించడానికి రోడ్డు లేక జనం అవస్థలు పడుతున్నారు. కనీసం ఆటో కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది.
సమయ పాలన ఏది..
గతంలో విధులు నిర్వర్తించిన టీజీఎండీసీ అధికారులు, పోలీసులు సమయపాలన పాటించి ప్రమాదాలకు చెక్‌పెట్టారు. సంబంధిత టీజీఎండీసీ, పోలీసుల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో సమయపాలనతో లారీలకు అనుమతి ఇచ్చేవారు. ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9గంటల వరకు లారీలను నిలిపి అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం కూడా మళ్లీ సమయ పాలనను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఘటనలు ఇలా..
ఉన్నతాధికారులు ఇప్పుడు ఇసుక తరలించాలనే ఉద్దేశంతో ఇబ్బడిముబ్బడిగా లారీలతో ఇసుక తరలించి అక్కడక్కడ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నారు. వారం రోజుల్లో రెండు ఘటనలు జరిగాయి. కాళేశ్వరంలోని ఎస్సీ కాలనీ వద్ద లారీ డైవర్ మద్యం మత్తులో ఇంట్లోకి దూసుకెళ్లాడు. ఇళ్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. పలుగుల వద్ద లారీలు జాం కావడంతో మంచిర్యాల జిల్లా మద్దికాల రాజు అనే యువకుడు లారీ రెండు చక్రాల కింద పడ్డాడు. ఈ ఘటనలో బైక్ నుజ్జునుజ్జు కాగా రాజు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇలా నిత్యం రోడ్డుపై లారీలతో ప్రమాదాలు జిల్లాలో ఎక్కడో ఓచోట జరుగుతున్నాయి.
అధికారులతో మాట్లాడుతా..
పరీక్షలు జరుగుతున్నందున సమయపాలనపై ఉన్నతాధికారులతో మాట్లాడుతా. విద్యార్థులు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. పార్కింగ్ కోసం స్థలాల పరిశీలన చేస్తున్నాం. ట్రాఫిక్‌జాంకు త్వరలో చెక్‌పెడుతాం.
– శ్రీకాంత్, టీజీఎండీసీ పీఓ,
భూపాలపల్లిఇసుక క్వారీలు
విద్యార్థులకు ఇబ్బందులు..
రోడ్డుకు రెండు వరుసల్లో లారీలు
పట్టించుకోని అధికారులు
టెన్త్ పరీక్షలు రాస్తున్న
విద్యార్థులకు తప్పని తిప్పలు
పదవ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభం కాగా ఏప్రిల్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఉదయం వేళలో లారీల రాకపోకలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే పరీక్ష సమయానికి వెళ్లరు. ఒక్క పరీక్షకు అందకపోయినా భవిష్యత్‌కు ఇబ్బంది తప్పదు. ప్రమాదం జరిగితే ఇబ్బందులకు గురవుతారు. బైక్, ఇతర ప్రైవేట్ వాహనాల్లో వచ్చేటప్పుడు లారీలతో దారిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పరీక్ష సమయాల్లో ఉదయం ఏడు గంటల నుంచి 9.30గంటలు, మద్యాహ్నం 12.30.గంటల నుంచి 2గంటల వరకు సమయపాలన ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఆవైపుగా ఆలోచన చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.