కాటారం: మారుమూల గ్రామాల్లో విక్రయించడానికి తీసుకొచ్చిన గంజాయితోపాటు విక్రయించే వ్యక్తిని మహాముత్తారం పోలీసులు పట్టుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా గౌరి గ్రామానికి చెందిన గణేశ్‌ఠాకూర్ మూడేళ్లుగా చెల్పూర్‌లోని ఓ రైస్‌మిల్లులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. జీతం సరిపోకపోవడంతో అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురాశతో విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి పలుచోట్ల ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఇదే క్రమంలో మంగళవారం సాయంత్రం గణేశ్‌ఠాకూర్ మహాముత్తారం మండలం యా మన్‌పల్లి సమీపంలో గల చెరువు వద్దకు గంజాయి విక్రయించడానికి వచ్చాడు. ముందస్తు సమాచారంతో మహాముత్తారం ఎస్సై మహేందర్‌కుమార్, పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకొని గణేశ్‌ఠాకూర్‌ను పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 12 కిలోల 765 గ్రాముల గంజాయి స్వాధీనపర్చుకొని సీజ్ చేసినట్లు డీఎస్పీ, సీఐ తెలిపారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం గణేశ్‌ఠాకూర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. కా గా, నిందితుడు గతంలో సైతం గంజాయి విక్రయిస్తూ ఘన్‌పూర్ పోలీసులకు పట్టుబడగా జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చినట్లు తెలిపారు. గంజాయి రవాణా చేసినా.. విక్రయించినా.. సేవించినా.. కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో మహాముత్తారం ఎస్సై మహేందర్ కుమార్, సీసీఎస్ ఎస్సై భాస్కర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
12కిలోల 756 గ్రాముల సరుకు
స్వాధీనం