జనగామ:ఓటర్ల జాబితాను పక్కాగా రూపొందించేందుకు ఎన్నికల సంఘం నడుం బిగించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమానికి జిల్లాలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితాను సవరించడం, అర్హులైన ప్రతీ ఒక్కరినీ చేర్చడం, డూప్లికేట్, మరణించిన వారితో పాటు వేరే చోటుకు మారిన వారి పేర్లను గుర్తించడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుండగా, జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు, దరఖాస్తుల పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది జాబితా వెలువరిస్తారు.
జిల్లాలో 7.72 లక్షల ఓటర్లు
జిల్లా (ఇతర జిల్లాల పరిధిలో ఉన్న మండలాలను కలుపుకుని)లో మొత్తం 865 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుత ఓటర్ల సంఖ్య 7,72,766గా నమోదైంది. జిల్లాలో 865 బీఎల్‌వోలు ఉండగా, 10 మందికి ఒక్కరు చొప్పున 86 మంది సూపర్ వైజర్లు సేవలు అందించనున్నారు. ఇంటింటికి సమాచారం సేకరించిన అనంతరం బీఎల్‌ఓ యాప్‌లో వాటిని అప్‌లోడ్ చేస్తారు. ప్రతీ బీఎల్‌ఓ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటర్ల వివరాలను సరిచూసి, కొత్త ఓట ర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, చిరునామా మార్పులు నమోదు చేయాలని అధికారులు సూచించారు.
బీఎల్‌ఓలకు సమర్పించాల్సిన గుర్తింపు కార్డులు
జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్టు, విద్యార్హత సర్టిఫికెట్, శాశ్వత నివాస ధృవీకరణ పత్రం, పారెస్ట్ రైట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రం, ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌లలో ఏదైన ఒకటి బీఎల్‌ఓలకు అందించాలని అధికారులు సూచించారు.
‘ఎస్‌ఐఆర్’కు సహకరించాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు ప్రజలు సహకరించాలి. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారా లు పంపిణీ చేస్తారు. అర్హులకు ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హులను తొలగించడమే కార్యక్రమ ముఖ్య ఉద్ధేశ్యం. పారదర్శక, సమగ్ర ఓటరు జాబితా కోసం ఎన్నిక సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్–26లో ప్రజలు భాగస్వాములు కావాలి.
– సందీప్ కుమార్ ఝా, కలెక్టర్
షెడ్యూల్ ఇలా..
15–06–2026 నుంచి 24–06–2026 వరకు సన్నాహాలు, శిక్షణ,
ముద్రణ పనులు పూర్తి.
25–06–2026 నుంచి 24–07–2026 వరకు బూత్ లెవల్ అధికారుల ఇంటింటి సర్వే
24–07–2026 లోపు పోలింగ్ కేంద్రాల
హేతుబద్ధీకరణ పూర్తి
31–07–2026 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
31–07–2026 నుంచి 30–08–2026 వరకు అభ్యంతరాల స్వీకరణ
31–08–2026 నుంచి 28–09–2026 వరకు నోటీసుల జారీ, దావాల పరిష్కారం
01–10–2026న తుది ఓటరు జాబితా
ప్రచురణ
ఈనెల 25 నుంచి స్పెషల్
ఇంటెన్సివ్ రివిజన్
ఓటర్ల జాబితా ప్రక్షాళనకు
ఇంటింటికీ బీఎల్‌ఓలు
జిల్లాలో 7.72 లక్షల ఓటర్లు
ప్రజలు సహకరించాలి: కలెక్టర్
నియోజకవర్గాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు
నియోజకవర్గం నియోజకవర్గం పోలింగ్ మొత్తం
కోడ్ కేంద్రాలు ఓటర్లు
జనగామ 98 278 2,50,241
స్టేషన్‌ఘన్‌పూర్ 99 291 2,60,625
పాలకుర్తి 100 296 2,61,718
మొత్తం 865 7,72,584


