చిల్పూరు: మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన అన్వర్–ఫాతిమాల కూతురు అస్మా గతేడాది రాసిన వ్యాసం జాతీయస్థాయికి ఎంపికై నట్లు పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పా ఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ సోమవారం తెలి పారు. 2025–26 విద్యాసంవత్సరంలో పాఠశాలలో పదో తరగతి చదివే అస్మా టాటా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫైవ్ పాయింట్స్ టు బిల్డ్ ఏ సెల్ఫ్ రిలైంట్ ఇండియా’ అనే అంశంపై రాసిన వ్యాసం జాతీయస్థాయికి ఎంపికై ందన్నారు. దీంతో విద్యార్థి అస్మాను సర్పంచ్ ఎడవెళ్లి లావణ్యమల్లారెడ్డి, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అభినందించారు.
ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
జనగామ రూరల్: మొహర్రం పండుగ సందర్భంగా పట్టణంలో లైటింగ్, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత సెక్షన్ అధికారులు పట్టణంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్స్ స్కీం దరఖాస్తులను పరిశీలించాలన్నారు. అన్ని సెక్షన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా కంప్యూటర్ల కొనుగోలు, జంతువధశాల టెండర్లు, కూరగాయల మార్కెట్ టెండర్ పనులు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని, ఆర్‌టీఐ దరఖాస్తులను వారం రోజులలోపు పరిష్కరించి రిపోర్టు అందజేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పేపర్ లీక్‌లపై
శాశ్వతంగా చెక్ పెట్టాలి
● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి
జనగామ: పేపర్ లీక్‌లకు శాశ్వతంగా చెక్ పెట్టి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని జనగామ డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకీ గూంజ్ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. జేఈఈ, నీట్, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ వంటి పోటీ పరీక్షల కోసం లక్షలాది మంది యువత సంవత్సరాల తరబడి శ్రమిస్తున్నా, ప్రతి 1000 మందిలో కేవలం 12 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ సహా అన్ని జాతీయ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై నిష్పాక్షిక దర్యాప్తు చేయడంతో పాటు పేపర్ లీక్‌లకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి కోసం పోరాడుతున్నారని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఈ ఉద్యమానికి ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి వంగాల కల్యాణి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉడుత రవి యాదవ్, డీసీసీ జనరల్ సెక్రటరీ ఎండి అన్వర్, అభిగౌడ్, ప్రవీణ్, మాజీద్ అప్సర్, వేముల మల్లేష్, వంగాల మల్లారెడ్డి, పిట్టల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
పొలంగట్టే.. బడి‘బాట’
చిల్పూరు: మండలంలోని ఫత్తేపూర్ పంచాయతీ పరిధిలోని భట్వాండతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పొలాల మధ్య ఉంది. ఈ పాఠశాలకు వెళ్లాలంటే పొలంగట్టే దీనికి దారి. పంటల సాగు లేని సమయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకున్నా.. సాగు చేస్తే పొలంగట్టు పైనుంచి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయులు వారి వాహనాలను రోడ్డు పక్కన చెట్ల కింద పెట్టి నడిచి రావాల్సిందే. ప్రస్తుతం ఈ పాఠశాలలో 10 మంది విద్యార్థులుండగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.


