జనగామ రూరల్: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీ సుకుంటుందని, దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 518 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు కొన్ని ఇలా..
● జిల్లా కేంద్రంలోని 23వ వార్డుకు చెందిన ఆర్.సంతోషిని తమకు ఎటువంటి ప్రభుత్వ పథకం అందడం లేదని ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు చేస్తే రాలేదని, ఇల్లు ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు.
● రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన జిట్టే శోభ తన 6.20 ఎకరాల భూమికి గాను పట్టా పాసుబుక్కులో 4.24 ఎకరాలు మాత్రమే నమోదైందని, ఇంకా రెండు ఎకరాల భూమి రికార్డులో నమోదు కాలేదన్నారు.
● బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లవరం బుచ్చిరెడ్డి, రెవెన్యూ పరిధిలోని తన సొంత భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని, న్యాయం చేయాలని విన్నవించారు.
● లింగాలఘణపురం మండలం చీటూర్ గ్రామానికి చెందిన ఎస్.అనూష తమది నిరుపేద కుటుంబమని, గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్–1లో ఆయా పోస్టు ఖాళీగా ఉందని, తనకు మంజూరు చేసి ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు.
● జనగామ మండలం పెందరాంచర్ల గ్రామానికి చెందిన బొంకూరి కృపాధానం తను బ్యాంక్‌లో తీసుకున్న పంట రుణం మాఫీ కాలేదని, న్యాయం చేయాలని వేడుకున్నారు.
● లింగాలఘణపురం మండలం కుందారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం, టిఫిన్ బిల్లులు చెల్లించాలని విన్నవించింది.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రజావాణిలో 518 దరఖాస్తులు
ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు..
మున్సిపల్ శానిటేషన్ విభాగంలో తన భర్త నర్సయ్య లేబర్ కూలీగా పనిచేయగా గతేడాది అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మున్సిపాలిటీలో పనిచేసే ఓ వ్యక్తి తనకు జవాన్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.1.40లక్షలు తీసుకుని ఉద్యోగం ఇవ్వలేదు. కుటుంబం గడవటం కష్టంగా ఉంది. డబ్బులు ఇప్పించడంతో పాటు ఉపాధి కల్పించాలి.
–జేరుపోతుల సుమలత, జనగామ
భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు..
నాగిరెడ్డిపల్లెకు చెందిన తన భర్త గుడ్ల నర్సయ్య పేరు మీద గ్రామంలో 265.65 సర్వేనంబర్‌లో 10 గుంటల భూమి ఉంది. భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. రెండు ఏళ్ల క్రితం తన భర్త పేరు మీద ఉన్న భూమిని పట్టా చేయాలని చూడగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పేరు మీద ఉంది. సర్వే చేసి తన పేరుమీద పట్టా పాస్‌బుక్కు ఇవ్వాలి.
– గుడ్ల ఎల్లమ్మ, నాగిరెడ్డిపల్లె, బచ్చన్నపేట


