ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్‌ బోర్డు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్‌ బోర్డు

Jun 23 2026 1:10 AM | Updated on Jun 23 2026 1:10 AM

రఘునాథపల్లి: సాధారణంగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో కనిపించే నో అడ్మిషన్‌ బోర్డు.. నేడు ఓ ప్రభుత్వ పాఠశాల ముందు కనిపించింది. రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్‌)లో విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరగడంతో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాల హెచ్‌ఎం ఆలేటి యాదవరెడ్డి సోమవారం పాఠశాల ముందు నో అడ్మిషన్‌ బోర్డును ఏర్పాటు చేశారు. గతేడాది కూడా 185 మంది విద్యార్థుల సంఖ్య పెరగడంతో ‘మా పాఠశాలలో సీట్లు లేవని’ అడ్మిషన్స్‌ క్లోజ్‌ అని బోర్డు ఏర్పాటు చేశారు.

రెండేళ్లలో అద్భుత ప్రగతి

మూడేళ్లుగా పాఠశాల సాధించిన ప్రగతి ప్రైవేట్‌ పాఠశాలలకు సైతం ఆదర్శంగా నిలిచింది. 2024–25 విద్యా సంవత్సరం కేవలం 52 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా 2025–26 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల కృషితో 133 మంది నూతన విద్యార్థులు చేరి, మొత్తం సంఖ్య 185కి చేరడంతో నో అడ్మిషన్‌ బోర్డు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరం 23 మంది విద్యార్థులు వెళ్లిపోగా కొత్తగా 53 మంది విద్యార్థులు ప్రవేశం పొందడంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 215 చేరింది. హెచ్‌ఎం యాదవరెడ్డి మాట్లాడుతూ తరగతిలో 30 మంది విద్యార్థులు ఉంటేనే బోధన సమర్థవంతంగా సాగుతుందని, అందుకే భారమైన మనస్సుతో అడ్మిషన్లు నిలుపుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఈ మేరకు సోమవారం ఎంఈఓ రఘునందర్‌రెడ్డి పాఠశాలను సందర్శించి విద్యార్థుల సంఖ్యను పెంచి హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు.

ఖిలాషాపూర్‌ ప్రాథమిక పాఠశాల ఘనత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement