జనగామ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు అర్హులందరికీ అందించమే లక్ష్యమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని మొదటి విడతలో మంజూరైన 3,500 ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడతలో నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరైన నేపథ్యంలో అర్హుల ఎంపికలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్ర క్రియలో అధికారులు సమర్థవంతంగా పని చేసి రాష్ట్రంలో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని ప్రశంసించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు లోనూ పారదర్శకత, జవాబుదారీతనం, వేగం ఉండేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, జెడ్పీ సీఈఓ రంగారావు, హౌసింగ్ పీడీ మాతృనా యక్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


