మహిళల భద్రత సమాజ అభివృద్ధికి పునాది | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రత సమాజ అభివృద్ధికి పునాది

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

జనగామ రూరల్‌: మహిళల భద్రత సమాజ అభివృద్ధికి పునాది అని, పోష్‌ యాక్ట్‌ అమలుతో మహిళలకు మరింత భద్రత ఉంటుందని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అన్నారు. మహిళల పని ప్రదేశాల్లో లైంగిక వేదింపులను నిరోధించే పోష్‌ చట్టం అమలులో కలెక్టర్‌ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో వ్యవసాయ శాఖ అధికారుల కలిసి పూలమొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల గౌరవం, భద్రతకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ అంబికా సోనీ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సర్కారు బడిలో చేరిన ఉపాధ్యాయుడి పిల్లలు

కొడకండ్ల: మండలంలోని ఏడునూతుల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోమారపు రాములు తన ముగ్గురు పిల్లలను శనివారం స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కొడకండ్ల ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాములు తన కుమార్తెలు అర్చన (5వ), అఖిల (3వ), ధరణి(2వ) తరగతిలో చేర్పించారు. తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలువగా గ్రామస్తులు రాములును అభినందించారు.

పోటీ పరీక్షల శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి

జనగామ రూరల్‌: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షల శిక్షణకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎస్‌. మురళీధర్‌ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీపీఎస్సీ గ్రూప్స్‌, రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డ్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకింగ్‌, వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి నాలుగు నెలల బేసిక్‌ ఫౌండేషన్‌ కోర్సును జిల్లాల్లోని అర్హులైన మైనార్టీ అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. డిగ్రీ అర్హత గల మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు జతపరచిన తమ దరఖాస్తులను హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 25 సాయంత్రం 5 గంటల లోపు అందించాలన్నారు. పూర్తి వివరాలకు 040–23236112, 9059050062 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

పూర్తిస్థాయి సమాచారం అందించాలి

నర్మెట: ఆర్టీఐ యాక్ట్‌ ప్రకారం వివరాలు కోరిన వ్యక్తులకు నిబంధనల మేరకు పూర్తి స్థాయిలో సమాచారం అందించాలని రాష్ట్ర సమాచార కమిషనర్‌ దేశాల భూపాల్‌ అన్నారు. మండలకేంద్రానికి చెందిన ఆర్టీఐ కార్యకర్త మహమ్మద్‌ తఫ్జిల్‌ నిబంధనల మేరకు వివరాలు కోరినా... సమాచారం ఇవ్వలేదంటూ దాఖలు చేసిన ద్వితీయ అప్పీల్‌పై విచారణ నిర్వహించగా మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పుష్పకుమారి, డీఈఓ సూరింటెండెంట్‌ హుస్సేన్‌ శనివారం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ఫిర్యాదుదారుడు కోరిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. జవాబుదారీతనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం కీలక సాధనమని తఫ్జిల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మోదీ పాలనలో సంక్షేమ పథకాలు

జనగామ రూరల్‌: మోదీ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో బీజేవైఎం యువ సమ్మేళనం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో సుపరిపాలన అందిస్తున్నారని దేశభద్రత విషయంలో ఎప్పుడు రాజీ పడలేదని గుర్తు చేశారు. యువత కోసం స్కిల్‌ ఇండియా పేరుతో దేశంలో ఉన్న యువతకు నైపుణ్యం పెంచే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కేవీఎల్‌ఎన్‌ రెడ్డి, చింతకింది సంతోష్‌, నవీన్‌, హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement