జనగామ: జిల్లాలో నేడు (ఆదివారం) జరగనున్న నీట్ రీ–ఎగ్జామ్‌కు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 588 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. సిద్ధిపేట రోడ్డులోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల (అటానమస్), జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను లోనికి అనుమతించ బోమని అధికారులు స్పష్టం చేశారు. కాగా పరీక్ష కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అభ్యర్థులు సూచనలను పాటించాలి
నీట్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు సూచనలు పాటించాలని, ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, వైద్య శిబిరం వంటి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నారు.
నేడు జిల్లాలో ‘నీట్’ రీ–ఎగ్జామ్


