● రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి
జనగామ రూరల్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీసీలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ.. జిల్లాలలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారంల పంపిణీ, తిరిగి స్వీకరణ, తదితర అంశాలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని తెలిపారు. వీసీలో ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు చర్యలు
సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.దివ్య ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్ నుంచి సెర్ప్, ఎంజీఎన్ ఆర్‌ఈజీఎస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 155 మంది సిబ్బందికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్నవారికి నేత్ర వైద్య పరీక్షలు, మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎరికాన్ టీపీఏ హెల్త్ ఇన్సూరెన్స్ అనుసంధానంతో యశోద హాస్పిటల్స్, మ్యాక్స్ విజన్, పాత్‌కై ండ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ భాస్కర్, మహమ్మద్ నూరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిష్కారాన్ని
వేగవంతం చేయాలి
భూధార్ సర్వే, భూభారతి దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో భూధార్ సర్వే, భూభారతి, సాదాబైనామా, నాన్–కడాస్ట్రల్ గ్రామాల రీ–సర్వే, నక్షా కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొడకండ్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. భూ వివరాలు ఖచ్చితంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలని, పెండింగ్ అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని పేర్కొన్నారు. తహసీల్దార్ అనిల్ బాబు, అధికారులు పాల్గొన్నారు.


