● విద్యార్థుల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం జనగామ మండలంలో చౌడారం కేజీబీవీ పాఠశాలలో ఆన్ అకాడమీ తరగతులను కలెక్టర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా గణితం బోధిస్తూ, గణితంపై భయం కాకుండా ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు గణితం, సైన్స్, సాంఘిక సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రత్యేక తరగతుల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మూడు సంవత్సరాల ప్రణాళికతో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కేజీబీవీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు. చదువుతోపాటు క్రీడల్లో ప్రతి భ కనబరిచేలా సదుపాయాలు కల్పించాలన్నారు. కేజీబీవీలో బాస్కెట్ బాల్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని పీఈటీకి ఆదేశాలు జారీ చేశారు. జీసీడీఓ గౌసియా బేగం పాల్గొన్నారు.
చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
చిన్నారుల ఆరోగ్యాభివృద్ధి, పోషకాహార స్థితిగతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మరిగడి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నమోదైన చిన్నారుల ఎత్తు, బరువులను పర్యవేక్షించి, కొలతల నమోదుపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, సిబ్బంది నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అనంతరం జెడ్పీఎస్‌ఎస్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించి కట్టెలపొయ్యిపై కాకుండా గ్యాస్‌పై వంట చేయాలని ఆదేశించారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులే విక్రయించాలి
రైతు సంక్షేమానికి ఐకేపీ రైతు సేవా కేంద్రాలు ఎంతో ఉయోగకరమని.. రైతులకు నాణ్యమైన విత్తనా లు, ఎరువులు, పురుగుమందులు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జనగామ మండలం మరిగడిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐకేపీ రైతు సేవా కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఐకేపీ రైతు సేవా కేంద్రంలో విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు సంబంధించిన లైసెన్స్‌లను దుకాణంలో స్పష్టంగా కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనంతరం కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ–పాస్ యంత్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులకు విక్రయాల నమోదు, బిల్లుల జారీ, స్టాక్ నిర్వహణ వంటి అంశాలను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీడీ నూరుద్దీన్, సర్పంచ్ కర్రె పర్శరాములు అధికారులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి పరిరక్షించాలి
జనగామ రూరల్: వన మహోత్సవంలో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు మొక్కలను నాటాల ని పిలుపునిచ్చారు. వివిధ శాఖల అధికారులు తమ లక్ష్యాలను వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు.


