‘ఉపాధి’లో 4వ స్థానం | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో 4వ స్థానం

Jun 18 2026 12:59 AM | Updated on Jun 18 2026 12:59 AM

పని దినాల కల్పనలో జిల్లా ముందంజ

సగటున రోజుకు 28వేల మంది

కూలీలు హాజరు

పకడ్బందీగా ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌

అటెండెన్స్‌

జిల్లాలో జోరుగా ఉపాధి పనులు

జనగామ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం (వీబీ జీ రాంజీ) అమలులో రాష్ట్ర స్థాయిలో జనగామ జిల్లా 4వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ రోజ్‌గార్‌ అజివిక మిషన్‌ గ్రామీణ) చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గడచిన రెండున్నర నెలల్లో జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు 11,26,123 పనిదినాలు కల్పించగా రోజు వారీగా సగటున రోజుకు 28 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచిందని డీఆర్‌డీఏ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) అమలు చేస్తుండగా ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ హాజరు విధానంలో ఇబ్బందులు పడుతున్నా.. 90 శాతం పూర్తి చేస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకుంటూ కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ విధానాన్ని అమలుచేస్తోంది. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు సంబంధించి జియో. ట్యాగింగ్‌ పూర్తి చేస్తేనే బిల్లులను మంజూరు చేస్తోంది. ఈనెల 6వ తేదీ నాటికి చేపట్టిన పనులకు కూలీలకు వేతనాలు అందించామని అధికారులు తెలుపు తున్నారు.

లక్ష్యం 23 లక్షలు..

జిల్లావ్యాప్తంగా మొత్తం 23 లక్షల పని దినాలను కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 11.26 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించారు. మొత్తంగా 55 శాతం వరకు లక్ష్యాన్ని పూర్తి చేశారు. మిగతా రోజుల్లోనూ పనిదినాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రోజువారీగా రూ.250 నుంచి రూ. 307 వరకు చెల్లించాల్సి ఉండగా జిల్లాలో సగటున రూ.274 వరకు అందుతోంది. పెద్ద సంఖ్యలో పనులు చేపట్టడంలో సఫలమవుతున్న అధికారులు జియో ట్యాంగింగ్‌ ప్రక్రియ సైతం పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దీంతో సకాలంలో డబ్బులు జమయ్యే అవకాశం నెలకొంది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఉపాధి పనులకు ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు.

71,723 యాక్టివ్‌ జాబ్‌కార్డులు

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ కుటుంబానికి వీబీజీ రా మ్‌ జీ పథకంలో 125 రోజులకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. జిల్లాలో 1.16 లక్షల కుటుంబాలకు జా బ్‌ కార్డులుండగా 2,24,748 కూలీలు ఉన్నారు. వీరి లో యాక్టివ్‌గా ఉన్న 71,723 జాబ్‌కార్డుల్లో 1,23, 913 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 50 శాతం వరకు కూలీలు పనులకు హాజరవుతున్నారు.

పకడ్బందీగా చేపడుతున్నాం..

జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహిస్తున్నాం. పనులు సక్రమంగా చేపట్టడం, సకాలంలో వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నాం. ఉపాధి పనుల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో నిలవడం అభినందనీయం.

– భాస్కర్‌, డీఆర్‌డీఓ

జిల్లాలో ఉపాధి కూలీల వివరాలు

జాబ్‌కార్డులు : 1,16,127

కూలీలు : 2,24,748

పనిదినాల లక్ష్యం : 23.81 లక్షలు

పూర్తయిన లక్ష్యం : 11 లక్షలు

సగటున కూలీల హాజరు : 28 వేలు

గ్రామాల వారీగా : 117

సగటు కూలీలు

మొత్తం గ్రామాలు : 280

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement