రఘునాథపల్లి: ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని చాటుతూ మండలంలోని గబ్బెట సర్పంచ్, వార్డు సభ్యులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి.. గబ్బెట సర్పంచ్ కూటిగంటి ఉపేంద్ర అనిల్ తమ ఇద్దరు పిల్లలతో పాటు 9వ వార్డు, 5వ వార్డు సభ్యులు జిట్టబోయిన రమ, ముక్కెర పూలమ్మ తమ పిల్లలను సర్కార్ బడిలో చేర్పించి ప్రభుత్వ విద్యపై తమ నమ్మకాన్ని చాటుకున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల పిల్లలతో కలిసి ఒకే రోజు 25 మంది పాఠశాలలో చేరడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా హెచ్‌ఎం కె.సునంద అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంఈఓ రఘునందన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులను ఎంఈఓ, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి అక్షరభ్యాసం చేయించారు. కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎలిశాల యాదలక్ష్మి, ఉపాధ్యాయులు థామసమ్మ, శివకుమార్, ఉమాదేవి, విజయమేరి తదితరులు పాల్గొన్నారు.


