రోడ్లపై వాహనాలు! | - | Sakshi
Sakshi News home page

రోడ్లపై వాహనాలు!

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

పార్కింగ్‌కు ఉపయోగించకుండా వాణిజ్య అవసరాలకు.. యథేచ్ఛగా వ్యాపారాలు.. అగ్నిప్రమాదాలు జరిగినా.. సెల్లార్ల నిబంధనలు అమలవుతున్నాయా..

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

సెల్లార్లలో వ్యాపారాలు

జనగామ: పార్కింగ్‌ కోసం నిర్మించిన సెల్లార్లు జిల్లా కేంద్రంలో వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. బ్యాంకులు, షోరూంలు, వాణిజ్య సముదాయాల్లో నిబంధనలకు విరుద్ధంగా గోదాములు, దుకాణాలు, డ్యాన్స్‌ స్కూల్స్‌, ఇంటర్నెట్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. దీంతో రోడ్లపైనే వాహనాల పార్కింగ్‌ పెరిగి ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. గతంలో అగ్నిప్రమాదాలు జరిగిన అనుభవాలు ఉన్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా సెల్లార్‌ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ పెరుగుతోంది.

జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్‌ ప్రాంతంతో పాటు స్వర్ణ కళామందిర్‌ పరిసరాల్లోని పలు బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, రెండు నుంచి మూడు అంతస్తుల భవనాల్లో పార్కింగ్‌ కోసం నిర్మించిన సెల్లార్లలో ప్రస్తుతం వివిధ వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ రోడ్డు ప్రాంతంలోని ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫ్లైవుడ్‌ దుకాణాలు, వాహనాల షోరూంలకు చెందిన భవనాల్లో కూడా సెల్లార్లను గోదాములుగా, సరుకుల నిల్వ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారు. అలాగే బాలాజీనగర్‌ గల్లీలోని ప్రధాన రహదారిపై ఉన్న పలు బ్యాంకులు, అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో ప్రైవేట్‌ సంస్థలు, డ్యాన్స్‌ స్కూల్స్‌, ఇంటర్నెట్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పార్కింగ్‌ కోసం ఉద్దేశించిన స్థలాలు పూర్తిగా వాణిజ్య అవసరాలకు మళ్లిపోవడంతో వాహనదారులు తమ కార్లు, ద్విచక్ర వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో ఎస్‌బీఐ పరిసరాలు, బాలాజీనగర్‌, హైదరాబాద్‌ రోడ్డు, స్వర్ణ కళామందిర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా పండుగలు, సెలవు దినాలు, వ్యాపార రద్దీ సమయాల్లో వాహనాలు రోడ్డు పక్కన వరుసగా నిలిపివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక వాహనం నిలిచిపోతే మరో వాహనం ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో విజయ షాపింగ్‌ మాల్‌తో పాటు మరికొన్ని వాణిజ్య భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి ఆస్తి నష్టం జరిగిన ఘటనలు పట్టణ ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి. అప్పుడు సెల్లార్ల వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి మళ్లీ యథాస్థితికే వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న సెల్లార్లు వందకు పైగా ఉండొచ్చని అంచనా. భవన యజమానులు అధిక అద్దెల ఆశతో సెల్లార్లను వ్యాపార సంస్థలకు కేటాయిస్తుండగా, పార్కింగ్‌ సదుపాయం లేక వాహనదారులు రోడ్లపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్‌ ఉల్లంఘనల పేరుతో పోలీసులు వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. అయితే పార్కింగ్‌ స్థలాలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న భవన యజమానులు, వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాలా లేక రోడ్లపై వాహనాలు నిలిపే వాహనదారులపైనా జరిమానాలు విధించాలా అనే అంశంపై పట్టణంలో చర్చ జరుగుతోంది. ప్రజల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో జరుగుతున్న వ్యాపారాలపై అధికారులు వెంటనే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని పట్ట ణ ప్రజలు కోరుతున్నారు.

భవన నిర్మాణ నిబంధనల ప్రకారం 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన భవనాలకు ఒక సెల్లార్‌, 1,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న భవనాలకు రెండో అంతస్థులో సెల్లార్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సెల్లార్లు పూర్తిగా వాహనాల పార్కింగ్‌ కోసం మాత్రమే వినియోగించాలి. అయితే పట్టణంలోని పలు వాణిజ్య భవనాలు, బ్యాంకులు, అపార్ట్‌మెంట్లలో ఈ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంబంధిత పురపాలక అధికారులు భవనాల విస్తీర్ణం, అనుమతులు, సెల్లార్ల వినియోగంపై క్షేత్రస్థాయిలో కొలతలు వేసి తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలకు కష్టాలు

బ్యాంకులు, షోరూంలు,

దుకాణాల కింద పొంచి ఉన్న ప్రమాదం

గతంలో అగ్నిప్రమాదాలు జరిగినా

పట్టించుకోని యజమానులు

నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్‌

భవన నిర్మాణ నిబంధనల ప్రకారం 750 నుంచి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న భవనాలకు ఒక సెల్లార్‌, 1,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం ఉన్న భవనాలకు అవసరమైన మేర అదనపు పార్కింగ్‌ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. సెల్లార్లను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధం. పట్టణంలో సెల్లార్ల వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించిన భవన యజమానులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తాం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement