జనగామ: జిల్లాలో వారం రోజులుగా వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలు తీవ్రంగా మండుతుండగా, ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. మే నెలలో నమోదైన ఎండలతో పోలిస్తే ప్రస్తుతం ఉక్కపోత అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
భానుడి నిప్పులు
పగటిపూట భానుడు నిప్పులు చెరుగుతుండగా, సాయంత్రం సమయానికి ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే వర్షం పడిన కొద్దిసేపటికే మళ్లీ వేడి, ఉక్కపోత ప్రారంభమవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో తరచూ చోటుచేసుకుంటున్న ఈ మార్పులు చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, తేమ శాతం పెరగడం వల్ల డీ హైడ్రేషన్, తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, జ్వరం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సంఖ్య కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నెల 12వ తేదీ తర్వాత ఎండలు తగ్గినట్టే కనిపించినప్పటికీ, 14, 15, 16 తేదీల్లో ఒక్కసారిగా తీవ్రత పెరిగాయి. దీంతో ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఎండలు, ఉక్కపోత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
పొద్దంతా భగభగలు..
సాయంత్రం కారుమబ్బులు
వాతావరణంలో వింత మార్పులు
అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు


