జనగామ: వేసవి సెలవుల అనంతరం సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల విరామం తర్వాత బడులు తెరుచుకోవడంతో గ్రామాలు, పట్టణాల్లో విద్యాలయాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాలలను మామిడి, ఆరటి తోరణాలు, పూల అలంకరణలు, గ్రీన్ కార్పెట్లతో అందంగా ముస్తాబు చేసిన ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందిస్తూ ఘనంగా స్వాగతం పలి కారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సౌకర్యాలపై ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విభాగాల్లో మొత్తం 508 పాఠశాలలు, 42 వసతి గృహాలు ఉన్నాయి.
పాఠ్యపుస్తకాల పంపిణీ
మొదటి రోజు బడికి వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి నూతన యూనిఫాంలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఎక్కువ మంది విద్యార్థులు పాత వాటితోనే వచ్చారు.
ఇంటింటికీ బడిబాట
బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రుల ను కలిశారు. ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరు తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరులో సాంకేతిక ఇబ్బందులు
పాఠశాలల పునఃప్రారంభం రోజున ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) హాజరు నమోదులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. జిల్లాలో సుమారు 2,900 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, వారిలో 800ల మందికి ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు కాకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై వెంటనే స్పందించిన విద్యాశాఖ అధికారులు సంబంధిత ఉపాధ్యాయులకు వాట్సాప్ ద్వారా సూచనలు జారీ చేసి, ప్రత్యామ్నాయ లింక్ ద్వారా హాజరు నమోదును పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో కొందరు విద్యార్థుల హాజరు నమోదులో కూడా ఎఫ్‌ఆర్‌ఎస్ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
గ్యాస్ పొయ్యిలపైనే మధ్యాహ్నం భోజనం
మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై కూడా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అన్ని పాఠశాలల్లో గ్యాస్ పొయ్యిలపైనే వంట చేయాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు మండల విద్యా అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 80 శాతం పాఠశాలల్లో గ్యాస్‌పై వంట నిర్వహించారు.
అమావాస్య ఎఫెక్ట్..
అమావాస్య ప్రభావం మొదటి రోజు హాజరుపై స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల హాజరు శాతం 30 శాతం కూడా దాటలేదని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కొన్ని పాఠశాలల్లో కేవలం ఒకటి నుంచి రెండు శాతం మంది విద్యార్థులే హాజరయ్యారు. అమావాస్య రోజున పిల్లలను బడికి పంపేందుకు చాలామంది తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
మరిన్ని ఫొటోలు 8లో..
అమావాస్య ప్రభావమే కారణం
పలుచోట్ల విద్యార్థులకు పూలతో ఘన స్వాగతం
ఎఫ్‌ఆర్‌ఎస్‌లో సాంకేతిక సమస్యలు


