వెల్లువెత్తిన వినతులు | - | Sakshi
Sakshi News home page

వెల్లువెత్తిన వినతులు

Jun 16 2026 1:10 AM | Updated on Jun 16 2026 1:10 AM

జనగామ: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ కార్యక్రమంపై ప్రజల్లో విశ్వాసం రోజు రోజుకూ పెరుగుతోంది. తమ సమస్యలు అధికారుల దృష్టికి చేరి న్యాయం జరుగుతుందనే నమ్మకంతో జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి సైతం వందలాది మంది ప్రజలు గ్రీవెన్స్‌కు తరలివస్తున్నారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రతీ వినతిని స్వయంగా స్వీకరిస్తూ, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలను అప్రమత్తం చేస్తుండడంతో గ్రీవెన్స్‌ ప్రజల ఆశలకు నమ్మకంగా మారుతోంది. సోమవారం కలెక్టరేట్‌ సమావేశం హాల్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌ కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని, ప్రజలతో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతీ దరఖాస్తును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి, త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. కాగా, గ్రీవెన్స్‌లో 532 దరఖాస్తులు వచ్చాయి. భూ వివాదాలు, రహదారుల సమస్యలు, గృహ నిర్మాణ అనుమతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధి, విద్యాసంస్థల సమస్యలు తదితర అంశాలపై ప్రజలు తమ వినతులను సమర్పించారు. రఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామస్థులు కర్ణాలకుంట చెరువు కట్టపై ముళ్ల చెట్లను తొలగించి శ్మశానవాటిక స్థలాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రంగారావు, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు తరలివచ్చిన అర్జీదారులు

ఒక్కరోజే 532 వినతులు

సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement