అమావాస్య సెంటిమెంటు! | - | Sakshi
Sakshi News home page

అమావాస్య సెంటిమెంటు!

Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM

జనగామ/రఘునాథపల్లి: ఈ ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 14 వరకు ప్రభుత్వం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. నేడు(సోమవారం)బడులు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు అమావాస్య కావడంతో పాటు మరుసటి రోజు మంగళవారం కావడంతో తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు వెనుకాడుతున్నారు. మొదటి రోజు విద్యార్థుల హాజరు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంచనా వేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వేదపండితులు సైతం అమావాస్య రోజు నూతన కార్యక్రమాలు వద్దని సూచిస్తున్నారు. దీంతో సంప్రదాయాలను పాటిస్తూ 50 రోజుల సెలవుల తర్వాత పిల్లలను అమావాస్య రోజు తరగతులకు పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. 17వ తేదీ బుధవారం నుంచి పాఠశాలలకు విద్యార్థుల హాజరు పూర్తిస్థాయిలో పెరిగే అవకాశం ఉంది.

క్రీడలతో

నాయకత్వ లక్షణాలు

జనగామ: క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ తెలిపారు. జనగామ క్రికెట్‌ అకాడమీ ఆధ్వర్యంలో ప్రెస్టన్‌ గ్రౌండ్‌లో గత వారం రోజులుగా జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారం ముగిసింది. అనంతరం జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణిశ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై విజేతలు, రన్నరప్‌ జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేసి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణానికి ఆధునిక సౌకర్యాలతో కూడిన క్రికెట్‌ గ్రౌండ్‌ ఏర్పా టు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్‌ రామగళ్ల విజయ్‌, ప్రెస్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కరస్పాండెంట్‌ బక్క ప్రవీణ్‌, క్రీడాకారులు, కోచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఏటీసీకి స్థల పరిశీలన

జనగామ రూరల్‌: జిల్లాకు మంజూరైన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ) నిర్మాణానికి సంబంధించి జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామంలో రెండు ఎకరాల భూమిని అధికారికంగా గుర్తించి తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీ11సీ)కు అప్పగించారు. ఆదివారం రెవెన్యూ, సర్వే అధికారులతో స్థల పరిశీలన నిర్వహించి భూమి హద్దులను నిర్ణయించారు. ఈ సందర్భంగా ఏటీసీ ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ రామానందం మాట్లాడుతూ.. ఈ కేంద్రం ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించడంతో పాటు స్థానిక పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువత స్వయం ఉపాధి దిశగా సొంత సంస్థలు స్థాపించుకునే అవకాశం లభించనుంది. సంబంధిత భూమిని టీజీ11సీ అధికారులకు అప్పగిస్తారని, ఏటీసీ నిర్మాణ పనులకు త్వరతగతిన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో నాగరత్న సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బిర్రు ఇస్తారి, రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు పాల్గొన్నారు.

హేమాచల క్షేత్రంలో భక్తుల సందడి

మంగపేట: రెండోయాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడింది. పాఠశాలలకు వేసవి సెలవులు ముగియడంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement