జనగామ: నూతన విద్యాసంవత్సరం పునఃప్రారంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నా.. 14 వేల మంది చిన్నారుల ప్రాణాలను మోసే స్కూల్ బస్సుల భద్రత మాత్రం ఇంకా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తోంది. 215 బస్సులకు గాను 40 బస్సులు ఇప్పటికీ ధ్రువీకరణకు నోచుకోలేదు. బడులకు సెలవులు ఇచ్చే సమయంలోనే రవాణాశాఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఫిట్‌నెనెస్ చేయించుకోవాలనే సమాచారం పంపించింది. రోజులవారీగా ఫిట్‌నెస్ కోసం జిల్లా రవాణాశాఖ అధికారులు సైతం కబురు పంపించారు. అయినప్పటికీ నాలుగు పదుల బస్సులకు ఫిట్‌నెస్ పెండింగ్‌లో ఉంది. ఈ నెల 14వ తేదీ ఆదివారం సెలవు కాగా, 15వ తేదీన విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఫిట్‌నెస్, రవాణాశాఖ నిబంధనల్లో కఠినంగా వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
లెక్కలు చెప్పే నిజం..
జిల్లాలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతీ ఐదు బస్సుల్లో ఒకటి ప్రమాణాలకు విరుద్ధంగా నడుస్తోందన్న ఆరోపణలు లేకపోలేదు. ఫిట్‌నెస్‌కు రవాణా శాఖ జూన్ 15ను ఆఖరి గడువుగా ప్రకటించినా, గత అనుభవాల దృష్ట్యా చివరి నిమిషంలో హడావుడిగా సర్టిఫికెట్లు తీసుకునే సంస్కృతి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. తనిఖీల్లో పట్టుబడితే జరిమానా అనే హెచ్చరిక కేవలం కాగితాలకే పరిమితమైతే, మూల్యం మాత్రం పిల్లలు చెల్లించాల్సి వస్తుంది.
పెరిగిన రిస్క్..
జనగామ, స్టేషన్‌ఘనన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లోని సుమారు ప్రైవేట్‌కు చెందిన 90 స్కూళ్లు ఉన్నాయి. ఈ బస్సులు మండలాల హద్దులు దాటి రాష్ట్ర, జాతీయ రహదారులపై తిరుగుతున్నాయి. హనుమకొండ నుంచి వచ్చే కార్పొరేట్ బస్సులతో కలిపితే ఈ నెట్‌వర్క్ మరింత విస్తరించింది. ఎక్కువ దూరం ప్రయాణించే కొద్దీ జాగ్రత్తలు రెట్టింపు అవుతాయి. ఫిట్‌నెస్ లేని బస్సు 50 కిలో మీటర్ల దూరం పిల్లలతో వెళ్లడమంటే, ప్రతిరోజూ ప్రమాదాన్ని ఆహ్వానించడమే.
ఇంజిన్ కండీషన్ ఒక్కటే కాదు..
రివర్స్ తీసుకునే సమయంలో అటెండర్ లేక చిన్నారులు మృతి చెందిన ఘటనలు జిల్లాలో నమోదయ్యాయి. ఫిట్‌నెస్ అంటే కేవలం ఇంజిన్ కండిషన్ కాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బస్సుకు పసుపు రంగు, సీసీ కెమెరాలు, జీపీఎస్, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక పరికరం, ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరి. డ్రైవర్‌కు 5 ఏళ్ల అనుభవంతో పాటు ప్రతీ బస్సులో అటెండర్ ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో చాలా బస్సుల్లో అటెండర్లే ఉండరు. ఇది నిబంధనల ఉల్లంఘనే కాదు, నిర్లక్ష్యానికి దారితీసే పరిస్థితి.
ముందున్న కార్యాచరణ ఏంటి?
జూన్ 15 తర్వాత ఫిట్‌నెస్ లేని బస్సును వెంటనే సీజ్ చేయాలి. జిల్లా స్థాయిలో రవాణా, విద్య, పోలీస్ శాఖలతో స్కూల్ బస్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రతీ మూడు నెలలకోసారి తనిఖీలు చేయాలి. ఉల్లంఘనలకు పాల్పడే స్కూళ్ల గుర్తింపు రద్దు చేసేంత కఠినంగా వ్యవహరిస్తేనే మార్పు వస్తుంది. పిల్లల చదువు కోసం వేసే ప్రతీ అడుగు భద్రంగా ఉండాలి.
వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం..
ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు ఫిట్‌నెస్, రవాణాశాఖ నిబంధనలు లేకుండా రోడ్డెక్కితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో మిగిలిపోయిన ప్రైవేట్ స్కూల్ బస్సులను వెంటనే ఫిట్‌నెస్ కంప్లీట్ చేసుకోవాలి. 15వ తేదీ నుంచి తమతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తారు. స్కూల్స్ పునఃప్రారంభమయ్యే సమయంలో పిట్‌నెస్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో బస్సులు రోడ్డెక్కరాదు.
– ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంవీఐ, జనగామ
జిల్లాలో ఫిట్‌నెస్‌కు దూరంగా 40 బస్సులు
14 వేల మంది చిన్నారుల ప్రయాణం
రేపటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
ఫిట్‌నెస్ లేకుంటే వాహనాలు సీజ్,
భారీ జరిమానాలు
సీసీ కెమెరా, జీపీఎస్, అత్యవసర ద్వారం
తప్పనిసరి
ఫీజులు లక్షల్లో, నిర్వహణ ఖర్చు తక్కువ


