● అడ్మిషన్ల కోసం అధ్యాపకుల
ఇంటింటి ప్రచారం
● గతేడాది కంటే పెరిగిన
ఉత్తీర్ణత శాతం
● డిజిటల్ బోధనపై ప్రత్యేక దృష్టి
● జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ
జూనియర్ కళాశాలలు
జనగామ రూరల్: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు అధ్యాపకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కల్పించే సౌకర్యాలు, మెరుగైన విద్య గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, డిజిటల్ తరగతులు, అనుభవం గల అధ్యాపకులతో బోధన, మధ్యాహ్న భోజన వసతులను విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో జిల్లాలో 6,443 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా 6,292 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో చాలామంది ఇంటర్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశాలు పెంచడమే లక్ష్యంగా కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు నేరుగా లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. జిల్లాలో మొత్తం 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా అన్ని కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ పలు కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
పెరిగిన ఉత్తీర్ణత శాతం
ఇంటర్‌లో గతేడాది ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా 22వ స్థానంలో ఉండగా అధ్యాపకుల కృషితో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి డిజిటల్ బోధనతో అవగాహన కల్పిస్తూ ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. ఈ విద్యాసంవత్సరం మధ్యాహ్న భో జనం అమలైతే డ్రాప్ అవుట్స్ తగ్గి ఉత్తీర్ణత శాతం కూడా పెరిగే అవకాశం ఉంది.
తరగతులు షురూ
ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మొదటి దశలో ప్రవేశాలు పొందారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీ గురుకులాలు : 16
ప్రైవేట్ : 13
ప్రభుత్వ : 7
కేజీబీవీలు : 12
ఆదర్శపాఠశాలలు : 8
మొత్తం సీట్లు : 6,100
జిల్లాలో జూనియర్ కళాశాలల
వివరాలు


